Vallabhaneni Vamsi: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో గురువారం ఉదయం సంచలనం నమోదయింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున గన్నవరంలో వల్లభనేని వంశీ ఇంటికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఆ తర్వాత అరెస్టు చేస్తున్నామని ప్రకటించారు. వారెంట్ చూపించి.. ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్లారు.
2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు పై, నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచినప్పటికీ ఆయన వైసీపీలో చేరారు. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు కుటుంబం పై వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. చివరికి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి చేశారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ దాడి తర్వాత.. చంద్రబాబు స్పందించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నారా లోకేష్ కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో వెల్లడించారు. అయితే నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడికి పాల్పడిన వారిలో వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఉన్నట్టు టిడిపి నాయకులు అనేక సందర్భాల్లో ఆరోపించారు. నాడు గవర్నర్, డిజిపిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. తమ పార్టీ కార్యాలయం పై దాడులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితేనాడు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఈ ఘటనపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. పైగా ఈ దాడికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా ధ్వంసం అయినట్టు తెలుస్తోంది.
అరెస్టుల పర్వం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానంగా ఈ ఘటన పైనే దృష్టి పెట్టింది. నాడు ఈ ఘటనలో పాలుపంచుకున్న వారి వివరాలను తెలుగుదేశం పార్టీ నాయకులు సేకరించారు. ఆ తర్వాత మరిన్ని ఆధారాలను రాబట్టి.. అరెస్టుల పర్వం మొదలుపెట్టారు. అయితే ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తుగా బెయిల్ తెచ్చుకోవడానికి కోర్టుకు వెళ్లారు. అయితే వారికి అక్కడ ప్రతిఘటన ఎదురయింది. దీంతో వాళ్లకు నిరాశ తప్పలేదు. అయితే ఈ కేసులో మొన్నటిదాకా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిశ్శబ్దాన్ని పాటించింది. ఆ తర్వాత ఈ కేసును మళ్లీ తిరగ తోడటం మొదలుపెట్టింది. గురువారం ఉదయం వల్లభనేని వంశీని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు.. తదుపరి అడుగులు కూడా బలంగా వేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నాడు వైసిపి ప్రభుత్వం లో అక్రమాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తోంది. ఇప్పటికే గనుల శాఖలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న వెంకటరెడ్డి అరెస్టై.. బెయిల్ పై విడుదలయ్యారు. ఆయన విడుదలైన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టు చేయడం విశేషం. వల్లభనేని వంశీ అరెస్టు ద్వారా కూటమి ప్రభుత్వం ప్రతీకారాన్ని మొదలుపెట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే తాము ఎటువంటి ప్రతీకారాలకు పాల్పడడం లేదని.. పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నారని కూటమి నేతలు అంటున్నారు.