https://oktelugu.com/

YS Jagan : పాపం జగన్.. రాజకీయాల్లో మాజీ సీఎంకు పరిణతి ఇంకా అవసరం..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. మొన్నటివరకు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం నడిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కూడా సేమ్ సిచ్యువేషన్‌ను ఎదుర్కొంటున్నాయి

Written By:
  • Srinivas
  • , Updated On : November 5, 2024 / 07:15 PM IST

    YS Jagan

    Follow us on

    YS Jagan :  రాజకీయాల్లో ఒకే పార్టీకి అధికారం ఏ మాత్రం శాశ్వతం కాదు. ఐదేళ్లకో, పదేళ్లకో రొటేషన్ కావాల్సిందే. ఒకవేళ ప్రజలకు ఆ నాయకుడు నచ్చితే మూడో సారి కూడా అవకాశం ఇవ్వడం సాధారణం. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను ఆ తరువాత అధికారంలోకి వచ్చిన పార్టీ విమర్శించడం సాధారణం. అందులోని లోపాలను ఎత్తిచూపడం కూడా చూస్తూనే ఉంటాం. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. మొన్నటివరకు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం నడిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కూడా సేమ్ సిచ్యువేషన్‌ను ఎదుర్కొంటున్నాయి.

    ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా చంద్రబాబు అమరావతికి ఫౌండేషన్ వేశారు. కానీ.. దానిని జగన్ అధికారంలోకి వచ్చాక మట్టుబెట్టేశారు. అమరావతి రాజధాని పేరును పూర్తిగా నిర్దాక్షిణ్యంగా చెరిపేశారు. విశాఖను రాజధానిగా ప్రకటించారు. చాలాకాలం పాటు అక్కడే హడావుడి చేశారు. అందులో భాగంగానే.. రుషికొండ మీద రూ.500 కోట్లతో పెద్ద పెద్ద ప్యాలెస్‌లు నిర్మించారు. ఆతిథ్యం కోసమని చెప్పి వందల కోట్లు ఖర్చు పెట్టి.. కనీవినీ ఎరుగని రీతిలో భవంతులను కట్టారు. అయితే.. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇటీవల ఈ భవంతులను సందర్శించారు. ఈ భారీ భవంతులను కథాకమామీషును బయటపెట్టారు. ఏకంగా డ్రోన్‌తో వీడియో తీయించి రిలీజ్ చేశారు. అయితే.. ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఏపీలో సాధారణంగానే జరుగుతుంటాయి. ఇదే సంప్రదాయం తెలంగాణలోనూ కొనసాగుతోందని చెప్పాలి.

    తెలంగాణ రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక కేసీఆర్‌ను కాళేశ్వరం రూపంలో టార్గెట్ చేశారు. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు దేనికీ పనికిరాకుండా పోయిందని ప్రచారం ప్రారంభించారు. కేసీఆర్‌ను అప్రదిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ ఈ విధంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో పలు పిల్లర్లు కూలిపోవడం కనిపించింది. బ్యారేజీలు దెబ్బతినడం కళ్లకు కట్టాయి. అందుకే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిపై దూకుడుగా వెళ్తోంది. అయితే.. రేవంత్ కాళేశ్వరంపై దూసుకుడుగా వెళ్తున్నప్పటికీ కేసీఆర్ చేపట్టిన పలు అభివృద్ధి పనులను మాత్రం కంటిన్యూ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఇటీవల మెట్రో రెండో దశ పనులను ప్రారంభించేందుకు సన్నద్ధం అయ్యారు. రూ.24,269 కోట్లతో కొత్తగా 5 కారిడార్లను నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేశారు. అయితే.. రాజకీయంగా కేసీఆర్‌ను రేవంత్ ఎంతలా విభేదిస్తున్నప్పటికీ నగరానికి, రాష్ట్రానికి నష్టం జరగకుండా తన పాలనను కొనసాగిస్తున్నారు. అంతకుముందు ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హైదరాబాద్‌ను ఐటీ పరంగా అభివృద్ధి చేశారనేది వాస్తవం. కానీ.. కేసీఆర్ అధికారంలో చేపట్టాక హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధిని కొనసాగించారు. చంద్రబాబుకు పేరు వస్తుందనని ఆయన ఎక్కడా తగ్గలేదు. ఇంకా కొత్తకొత్త స్టార్టప్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే పని చేస్తున్నారు. కేసీఆర్‌పై విచారణలు కొనసాగిస్తూనే.. అభివృద్ధిని ఎక్కడా ఆపడం లేదు.

    కానీ.. 2019లో ఏపీలో జగన్ అధికారం చేపట్టాక అమరావతిని మొత్తమే పక్కన పెట్టేశారు. చంద్రబాబు, ఏపీ ప్రజల ఆకాంక్షను ఆయన పూర్తిగా మట్టుబెట్టారనే చెప్పొచ్చు. అదే అమరావతి రాజధానిని అలాగే కొనసాగించి.. అక్కడి పనులు అలానే నడిపిస్తే జగన్‌కు మంచి మైలేజీ వచ్చేదే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కానీ.. ఎంతసేపు అమరావతి రాజధానిని నిర్మిస్తే చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుందోనన్న అభిప్రాయంతోనే జగన్ దానికి వీడ్కోలు పలికారన్న ప్రచారమూ ఉంది. అయితే.. మరోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు గత జగన్ ప్రభుత్వం లోని పెండింగ్ పనులు చేస్తూ వస్తున్నారు. జగన్ హయాంలో మొదలుపెట్టిన భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పనులను చంద్రబాబు వేగవంతం చేయిస్తున్నారు. రాక రాక వచ్చిన అవకాశాన్ని జగన్ వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యారన్న ఫీలింగే ప్రజల్లోనూ ఉంది. ముగ్గురు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ నుంచి జగన్ నేటికీ ఒక్క మంచి విషయం కూడా నేర్చుకోలేదని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఆయన రాజకీయాల్లో మరింత పరిణతి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇలానే ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వస్తుందన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి.

    Tags