YSR Congress party
YSR Congress : వైసీపీకి ( YSR Congress )షాక్ తప్పదా? ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్ళనున్నారా? అన్నింటికీ మించి ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి జంప్ చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం ఎదురయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి దక్కింది కేవలం 11 స్థానాలే. ఓ ఐదు ఆరు జిల్లాల్లో అయితే కనీసం ఖాతా కూడా తెరవలేదు. అదే సమయంలో గెలిచిన 11 మందిలో జగన్మోహన్ రెడ్డి ఒకరు. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. అలాగే మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపు పొందిన వారిలో ఉన్నారు. అయితే మిగతా ఆరుగురు మాత్రం రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన వారే. అయితే అందులో ఐదుగురు వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.
* ఆ ఎమ్మెల్యేల్లో అదే బాధ
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) శాసనసభను బహిష్కరించింది. కేవలం ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసేందుకే సభకు హాజరైంది. అక్కడ నుంచి వివిధ కారణాలు చెబుతూ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. అదే సమయంలో శాసనమండలిలో మాత్రం వైసిపి ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు. వైసిపి పక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై గళం ఎత్తుతున్నారు. కానీ ఆ ఛాన్స్ ఎమ్మెల్యేలకు లేకపోవడంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. పైగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. శాసనసభకు హాజరై ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలనుకుంటున్నారు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు. కానీ అధినేత రాజకీయ కారణాలు చెబుతూ అడ్డుకోవడంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి ఉంది.
* అసంతృప్తితో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి( Bala Nagi Reddy) గత కొద్దిరోజులుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల కర్నూలు జిల్లా వైసీపీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించిన ముఖం చాటేసినట్లు తెలుస్తోంది. పైగా ఆయన కూటమి ప్రభుత్వంపై సాఫ్ట్ కార్నర్ తో ఉన్నట్లు సమాచారం. ఇంకోవైపు విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఒకరు కూటమి పార్టీల నేతలతో సఖ్యతగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ అయిదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఒకేసారి టిడిపిలోకి ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
* పటిష్టమైన స్థితిలో కూటమి
అయితే కూటమి( Alliance ) పటిష్టమైన స్థితిలో ఉంది. 164 అసెంబ్లీ సీట్లతో అంతులేని మెజారిటీతో ఉంది. తెలుగుదేశం పార్టీ 135 సీట్లతో తిరుగులేని ఆధిపత్యంతో ఉంది. అటువంటిది విపక్ష వైసిపి ఎమ్మెల్యేలు వస్తే తీసుకుంటుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. 2014లో టిడిపిలోకి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఫిరాయించారు. అందులో కొందరు మంత్రి పదవులు దక్కించుకున్నారు. అయితే టిడిపికి అదో మాయని మచ్చగా మిగిలింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీలోకి సైతం ఓ నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు ఫిరాయించారు. అది కూడా వైసీపీకి ప్రతికూల ప్రభావం చూపించింది. ఇటువంటి అనుభవాల దృష్ట్యా చంద్రబాబు ఇప్పుడు ఈ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వస్తామంటే తీసుకుంటారా? ఆ పరిస్థితి ఉందా? అంటే మాత్రం సమాధానం దొరకడం లేదు. అయితే రాజకీయ వ్యూహంలో భాగంగా వైసీపీకి వారి గుడ్ బై చెప్పవచ్చు కానీ.. న్యూట్రల్ గా ఉంటూ వైసీపీ అధినేతను ఇబ్బంది పెట్టవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Five ysrcp mlas ready to join tdp at once
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com