Margadarshi Case : మార్గదర్శికి నిప్పు.. ఇక రామోజీకే ఎసరు

అయితే అటు బ్రాంచ్ మేనేజర్ల చెప్పిన దాంతో రామోజీకి ఉచ్చు బిగిసిందని చెప్పుకోవడం కాస్తా అతే అవుతోంది. ఈ విషయంలో రాజగురువుకు ఉన్న లెక్కలు ఉన్నాయని.. ఆయన ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Written By: Dharma, Updated On : July 6, 2023 4:35 pm
Follow us on

Margadarshi Case : మార్గదర్శి కేసులతో రాజగురువు రామోజీరావుకు ఏపీ సీఎం జగన్ వెంటాడుతునే ఉన్నారు. ఇప్పటివరకూ ఎవరూ సాహసించని విధంగా సీఐడీ కేసులతో వెంటపడుతున్నారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తూ రామోజీరావు సైతం అదే దూకుడును కనబరుస్తున్నారు. ఇటీవల గుంటూరులోని సీఐడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు సైతం డుమ్మా కొట్టారు. చాలా రోజుల కిందటే సీఐడీ అధికారులు విచారణకు హాజరుకావాలని రామోజీరావుతో పాటు శైలజా కిరణ్ లకు నోటీసులిచ్చారు. కానీ తీరా హాజరుకావాలసిన సమయానికి అనారోగ్యంతో ఉన్నానని రామోజీరావు.. రాలేని స్థితిలో ఉన్నానని శైలజా కిరణ్ లు ఈ మెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ కేసు విచారణలో భాగంగా చైర్మన్ గా ఉన్న రామోజీరావు, ఎండీ అయిన శైలజాకిరణ్ లు గైర్హాజరైనా.. ఏపీలో మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు మాత్రం హాజరయ్యారు. విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. డిపాజిట్ల నుంచి నిధుల మళ్లింపు వరకూ విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. డిపాజిట్లు ఎలా సేకరించారు. చిట్ పాడిన వారికి ఎన్నిరోజుల్లో నగదు ఇస్తున్నారు? కమీషన్ ఎంత వసూలు చేసేవారు అన్నవాటిపై సీఐడీ అధికారులు క్షుణ్ణంగా ఆరా తీసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై సీఐడీ వర్గాలు స్పందించలేదు.

అయితే ఈ విషయంలో నీలి మీడియా చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సాక్షి మీడియాలో బ్రాంచ్ మేనేజర్లు సీఐడీ అధికారులకు సరెండర్ అయిపోయినట్టు కథనం వచ్చింది. గతం నుంచి డిపాజిట్లు ఇదే విధంగా పక్కదారి పట్టించేవారమని.. తాము నిమిత్తమాత్రులమని.. యాజమాన్యం చెప్పిన విధంగా నడుచుకున్నట్టు వారు స్టేట్ మెంట్ ఇచ్చినట్టు సాక్షి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రాజగురువు అడ్డంగా దొరికిపోయారని.. ఆయన వందీమాగధులు పూర్తి సమాచారమిచ్చారని.. రామోజీ పని అయిపోయిందన్న రేంజ్ లో సాక్షి కథనం వడ్డించింది.

దీనిపై తెలుగులోని అత్యంత సర్క్యూలేషన్ ఉన్న పత్రిక అయిన ఈనాడులో మాత్రం ఎటువంటి కథనం రాలేదు. ఇప్పటివరకూ రాజకీయ ప్రముఖుల అభిప్రాయాలతో రామోజీరావు మంచి వాడని, రాజకీయ దురుద్దేశ్యంతో వైసీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ పతాక శీర్షికన కథనాలు వెలువరించింది. చివరకు సీఐడీ వ్యవస్థకు దురుద్దేశ్యాలను ఆపాదించింది. మార్గదర్శి బ్యాంకు మేనేజర్ల విచారణపై ఎటువంటి స్పందన లేదు. అయితే అటు బ్రాంచ్ మేనేజర్ల చెప్పిన దాంతో రామోజీకి ఉచ్చు బిగిసిందని చెప్పుకోవడం కాస్తా అతే అవుతోంది. ఈ విషయంలో రాజగురువుకు ఉన్న లెక్కలు ఉన్నాయని.. ఆయన ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.