YS Jagan : మీడియా అనేది పొలిటికల్ పార్టీల మౌత్ పీస్ అయిపోయింది. ఇలా చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ తెలుగు నాట జరుగుతున్నది ఇదే. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే కాదు వెబ్ మీడియా కూడా రాజకీయరంగు పులముకుంది. ప్రధాన మీడియా సంస్థలకు అనుబంధంగా ప్రస్తుతం వెబ్ మీడియా ఉంది. అయితే వెబ్ మీడియా సరిగ్గా పురుడు పోసుకోకముందే.. ఈ మీడియాలో ఉన్న అవకాశాలను ముందుగా గుర్తించి.. గ్రేట్ ఆంధ్ర అనే వెబ్ మీడియా ఏర్పాటయింది. ప్రారంభంలో అంతగా ఆదరణకు నోచుకోకపోయినప్పటికీ.. ఆ తర్వాత రాజకీయరంగు అద్దుకోవడంతో అది కాస్త పాపులర్ అయింది. మొదటినుంచి వైయస్ కుటుంబానికి గ్రేట్ఆంధ్ర అనుకూలంగా ఉండేదనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలపై తన మార్క్ రాతలు గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్ ప్రచురించేది. మొన్నటి ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వార్తలు రాసింది. విశ్లేషణలు కూడా అదే స్థాయిలో చేసింది. ఇటీవల ఎన్నికల్లో కూటమి పది సీట్లు కూడా గెలుచుకోలేదని స్పష్టం చేసింది. కానీ ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారింది. గ్రేట్ఆంధ్రలో పబ్లిష్ అవుతున్న వార్తల రూపు కూడా పూర్తిగా మారిపోయింది. ఇన్నాళ్లుగా జగన్ భజన చేసిన గ్రేట్ఆంధ్ర ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించిందని వైసిపి నాయకులు అంటున్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అమలైన ప్రభుత్వ పథకాలపై ఆహా ఓహో అంటూ గ్రేట్ ఆంధ్ర కథనాలు రాసింది. ఇందుకు తగ్గట్టుగానే గ్రేట్ ఆంధ్రకు ప్రభుత్వ యాడ్స్ విపరీతంగా వచ్చాయి.
ఎప్పుడైతే జగన్ అధికారాన్ని కోల్పోయాడో గ్రేట్ఆంధ్ర ఒక్కసారిగా తన వార్తల శైలి పూర్తిగా మార్చేసింది.. అప్పటిదాకా జగన్ ప్రభుత్వ పరిపాలనను గొప్పగా చెప్పిన గ్రేట్ ఆంధ్ర.. ఆ తర్వాత తులనాడడం మొదలుపెట్టింది. ప్రభుత్వ పథకాలు బాగోలేదని, అభివృద్ధిని దూరం పెట్టారని, అడ్డగోలుగా అప్పులు చేశారని, మీడియాను దగ్గరికి రానివ్వలేదని, ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించడం మొదలుపెట్టింది. పరిపాలన సరిగా ఉంటే ఎందుకు ఓడిపోతారని దూయబట్టడం ప్రారంభించింది.. వాస్తవానికి ఇదే గ్రేట్ ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన కాలంలో సాక్షికి మించి కథనాలను రాసింది. ఒకానొక దశలో సాక్షి కూడా దిగదుడుపు అనేలాగా విశ్లేషణలు రూపొందించింది. ఎవరు చూడని కోణంలో వార్తలు రాసి సరికొత్తగా ప్రజెంట్ చేసింది. ఆ కథనాలను వైసీపీ సోషల్ మీడియా విభాగం విస్తృతంగా సర్కులేట్ చేసింది. దీంతో గ్రేట్ ఆంధ్ర అంటే తమ సొంత వెబ్ సైట్ అనే లాగా వైసీపీ నాయకులు ప్రొజెక్ట్ చేసుకునేదాకా పరిస్థితి వెళ్ళింది. కానీ ఇప్పుడు అధికారాంతమున.. అనే సామెతను గ్రేట్ ఆంధ్ర నిజం చేసి చూపిస్తోంది.
గత కొద్దిరోజులుగా జగన్ ప్రభుత్వం లో చోటు చేసుకున్న తప్పులను గ్రేట్ఆంధ్ర ఎత్తిచూపుతోంది.. ఢిల్లీలో ధర్నా చేసిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, అది సరైన పద్ధతి కాదంటూ జగన్మోహన్ రెడ్డికి తలంటుటోంది. ఇదే సమయంలో ఇటీవలి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సింహభాగం కేటాయించిన నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరును గ్రేట్ఆంధ్ర నిర్ద్వంద్వంగా విమర్శిస్తోంది. ఇదే సమయంలో కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను విపరీతంగా హైలెట్ చేస్తోంది. గుంటూరు అమ్మాయిని పవన్ కళ్యాణ్ రక్షించడం.. తిరుపతిలో ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టడం.. కోనో కార్పస్ మొక్కలను నరికించడం.. వంటి ఘటనలను గొప్పగా రాస్తోంది. నారా లోకేష్ ఇటీవల దివ్యాంగ విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థలో ప్రవేశాలు కల్పించడం.. చంద్రబాబు నాయుడు బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి సింహభాగం దక్కేలా కృషి చేయడం వంటి విషయాలను కూడా సానుకూల దృక్పథంతో రాస్తోంది. అయితే గ్రేట్ ఆంధ్ర ఒకసారి గా ప్లేట్ ఫిరాయించడం వైసిపి శ్రేణులకు మింగుడు పడటం లేదు. ఈ ఐదు సంవత్సరాలు గ్రేట్ఆంధ్ర ఇదే ధోరణి కొనసాగిస్తుందని.. జగన్మోహన్ రెడ్డిని అదేపనిగా విమర్శిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పెద్దల ప్రాపకం లేకుంటే సైట్ నడపడం కష్టమని గ్రేట్ ఆంధ్ర నిర్వాహకులకు కూడా అర్థమైందని వారు చెబుతున్నారు. సో ఈ ఐదేళ్లు గ్రేట్ఆంధ్ర సైట్ నుంచి జగన్మోహన్ రెడ్డికి తలంటు తప్పదన్నమాట.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Finally jagan is being scolded even by great andhra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com