Sankranti Cockfighting: సంక్రాంతి( Sankranti festival ) అంటే తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చేది కోడిపందాలు. కోనసీమలో కోడిపందాలు అంటే జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలు కోడిపందాలకు సిద్ధం అవుతున్నాయి. సంక్రాంతికి జరిగే ఈ కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. ఈ కోడిపందాలను చూసేందుకు ఏపీలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ప్రజలు రావడం ప్రత్యేకత. అయితే ఇంకా సంక్రాంతికి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో పందెం కోళ్లను సిద్ధం చేసే పనిలో ఉన్నారు నిర్వాహకులు.
పందెం కోళ్ళు ప్రత్యేకత..
సంక్రాంతి అంటే వాకిట ముందు రంగవల్లులు, వాటిలో గొబ్బెమ్మలు, హరిదాసులు, బసవన్నలు, పిండి వంటలు, తీర్థాలు మాత్రమే కాదు. కోడిపందాలకు సైతం ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.అయితే ఏదో పందెం కోళ్ళు బరిలో దిగుతాయి అనుకుంటే పొరపడినట్టే. దానికి ఆర్మీ ట్రైనింగ్ ( army training)శిక్షణ కూడా ఉంటుంది. ఈత, బలవర్ధక ఆహారం డైలీ ఇస్తుంటారు. కాకి, నెమలి, డేగ, సేతువ, రసంగి వంటి పేర్లతో పూర్తి శిక్షణ తీసుకుంటున్నాయి ఈ పందెం కోళ్ళు.
రాజ ‘భోగం’తో..
సంక్రాంతి కథనరంగంలో దూకేందుకు పందెం కోళ్ళు సిద్ధమవుతున్నాయి. కత్తులు నూరుతూ ప్రత్యేక శ్రద్ధతో వీటిని పెంచుతున్నారు నిర్వాహకులు, శిక్షకులు. ఇంకా నెలరోజుల సమయం మాత్రమే ఉండడంతో గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్ల సన్నాహాలు మొదలయ్యాయి. ప్రతిరోజు పందెం పుంజులకు బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. పోరాడే సత్తా ఉన్న పుంజులను మాత్రమే ఎంపిక చేస్తున్నారు. పందెం కోళ్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది కోనసీమ. కొబ్బరి తోటల చుట్టూ ప్రత్యేకంగా ఫెన్సింగ్ వేసి వీటికి రక్షణ కల్పిస్తున్నారు. అయితే వీటికి రాజ భోగం అందుతోంది. బాదంపప్పు జీడిపప్పు, మటన్ కైమా, తాటి బెల్లం, నువ్వుల నూనెతో చేసిన ఉండలు వంటి బలవర్ధమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఇక ఉదయం ఆరు గంటల సమయంలో వాటిని చెరువుల్లోనూ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో ఈత నేర్పిస్తున్నారు. ఒక్కో పుంజుపై రోజుకు వందలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ కోడి పుంజులు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అప్పుడే గోదావరి జిల్లాలకు సంక్రాంతి సందడి వచ్చేసింది ఈ కోళ్ల రూపంలో..