East Godavari: బిడ్డ కోసం తండ్రి ఆరాటం.. వైరల్!

తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణి విశాఖ కేజీహెచ్ లో చేరింది. శిరీష నెలలు నిండకుండానే ఒక బిడ్డను ప్రసవించింది.

Written By: Dharma, Updated On : June 19, 2024 4:41 pm

East Godavari

Follow us on

East Godavari: ఉత్తరాంధ్రలో పెద్ద ఆసుపత్రి విశాఖ కేజిహెచ్. ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అత్యవసర వైద్యం కోసం కేజీహెచ్ నే ఆశ్రయిస్తారు. ఒడిశా తో పాటు చత్తీస్ గడ్ ప్రజలు కూడా తరలివస్తుంటారు. కానీ ప్రభుత్వాలు మారుతున్నా కేజీహెచ్ లో మౌలిక వసతులు పెరగడం లేదు. రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డను కాపాడుకునేందుకు ఓ తండ్రి పడిన బాధ, అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం, వసతుల లేమి బయటపడింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణి విశాఖ కేజీహెచ్ లో చేరింది. శిరీష నెలలు నిండకుండానే ఒక బిడ్డను ప్రసవించింది. నెలలు నిండకుండానే జన్మించడం, బరువు తక్కువగా ఉండడంతో ఆ చిన్నారిని పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఐసీయూలో పెట్టాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టారు. ఐసీయూ యూనిట్ కు తరలించే క్రమంలో బిడ్డను ఎత్తుకొని నర్సు ముందు నడుస్తుండగా.. బిడ్డ తండ్రి విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ ను తన భుజాలపై మోస్తూ ఆమె వెనుకే నడుచుకుంటూ వెళ్ళాడు. సమయానికి సిబ్బంది లేకపోవడం, బ్యాటరీ మోటారు చక్రం ఏర్పాటు చేయకపోవడంతో.. బరువైన సిలిండర్ ను అతి కష్టం మీద తరలించాడు. ఈ దృశ్యాన్ని చూసినవారు అయ్యో పాపం అంటూ నిట్టూర్చారు. చాలామంది బాధపడ్డారు కూడా. అయితే అక్కడున్న వారిలో ఒకరు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. క్షణాల్లో ఇవి వైరల్ అయ్యాయి. మీడియాలో కథనాలు ప్రారంభమయ్యాయి.

పేరుకే పెద్ద ఆసుపత్రి కానీ కేజీహెచ్ లో వసతులు మెరుగుపడడం లేదు. నిత్యం వేలాది మంది రోగులు ఇక్కడికి వస్తుంటారు. కానీ అందుకు తగ్గట్టుగా వైద్యం మెరుగుపడటం లేదు. సేవలు సైతంఅందని ద్రాక్షగా మిగులుతున్నాయి.అడుగడుగునా వైఫల్యాలు కనిపిస్తున్నాయి.గతంలోవివిధ కారణాలతో మృతి చెందిన వారికి కనీసం అంబులెన్స్ సదుపాయం కూడా కల్పించలేదు. దీంతో ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాల్లో మృతదేహాలు తరలించడం సోషల్ మీడియాలో వెలుగు చూసిన సందర్భాలు ఉన్నాయి.అటువంటి ఘటనలు వెలుగు చూసినప్పుడు హడావిడి చేసే అధికారులు.. తరువాత అటువైపు చూడడం మానేస్తున్నారు. కనీసం కొత్త ప్రభుత్వమైన కేజీహెచ్ పై దృష్టి సారించాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు.