Farmers: మన దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసినవి యుద్ధాలు కావు. రాజకీయ సంక్షోభాలు కావు.. టమాట, ఉల్లి.. చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తున్నప్పటికీ.. ఇవి మన దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒకానొక సందర్భంలో కేంద్రంలోని ప్రభుత్వం టమాట, ఉల్లి దెబ్బకు పడిపోయిందంటే అతిశయోక్తి కాదు. మనదేశంలో సాధారణంగానే టమాట, ఉల్లి వినియోగం అధికంగా ఉంటుంది. టమాటాను ప్రాంతాలతో సంబంధం లేకుండా ఉపయోగిస్తారు. ఉల్లిని కూడా వంటల్లో విరివిగా వాడుతుంటారు.. ఉల్లి అనేది మనదేశంలో ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశంలోనూ పండుతుంది. కాకపోతే అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉల్లి పంట అంతగా దిగుబడి రాదు. అప్పుడు ధర అమాంతం పెరుగుతుంది. ఉల్లి అనేది నిత్యావసర వస్తువు కాబట్టి సహజంగానే ప్రభుత్వాలపై ఒత్తిడి ఉంటుంది. ఆ సమయంలో ఉల్లి ఏకంగా వంటిల్లు దాటేసి దేశ రాజకీయాలనే శాసిస్తుంది. ఇక టమాట కూడా అంతే.. టమాట మన దేశంలో విపరీతమైన వినియోగంలో ఉంటుంది. కూరల్లో.. ఇతర వంటలలో టమాటా వినియోగం అనేది కచ్చితంగా ఉంటుంది. అందువల్లే టమాటా ధర పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలు అప్రమత్తమవుతుంటాయి. అవసరమైతే పోలీసుల బందోబస్తు మధ్య టమాటాలను ప్రజలకు పంపిణీ చేస్తుంటాయి. అయితే టమాటా ధర ఎప్పటికీ స్థిరంగా ఉండదు. ముఖ్యంగా వేసవికాలంలో టమాటాకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అని ఈసారి మాత్రం డిమాండ్ దారుణంగా పడిపోయింది. అంత ఉత్పత్తి భారీగా ఉండడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Ration Cards : రేషన్ కార్డ్ అప్లై చేశారా? మీ కార్డ్ గురించి ఇలా తెలుసుకోండి
గుండెలను పిండేసే దారుణం
ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. కష్టపడి పండించిన టమాటా పంటకు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా మదన పడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో టమాటా పంటకు పేరెన్నిక గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి ప్రాంతంలో ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో రైతులు అంత తక్కువకు టమాట పంటను అమ్ముకోలేక రోడ్ల వెంట వృధాగా పడేస్తున్నారు.. గత వారం రోజులుగా టమాటకు కాస్త ధర పెరగడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పెండూరి వారి పల్లె గ్రామానికి చెందిన మల్లప్ప అనే రైతు 190 పెట్టెలలో టమాటాలను తీసుకొచ్చాడు. మదనపల్లి మార్కెట్లో 30 కిలోల బాక్స్ కేవలం 50 రూపాయల వరకే పలికింది. దీంతో అంత తక్కువకు పంటను అమ్ముకోలేక అతడు రోడ్డు పక్కన పారబోస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. మల్లప్ప 2 ఎకరాల విస్తీర్ణంలో టమాట పంటను సాగు చేశాడు. ఈసారి దిగుబడి భారీగా ఉంది. పైగా ఈ కాలంలో ఈ స్థాయిలో దిగుబడి అతడు ఊహించలేదు. అయితే పంట దిగుబడి ఆ స్థాయిలో వచ్చినప్పటికీ ధర ఆశించిన విధంగా లేకపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తక్కువ ధరకు అమ్ముకోలేక ఇలా రోడ్ల పక్కన పారబోస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే టమాటా పంట ఉత్పత్తి అధికంగా ఉండే మదనపల్లి ప్రాంతంలో శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Also Read: AP Rains : ఏపీలో వర్ష బీభత్సం.. ఆ జిల్లాలకు బిగ్ అలెర్ట్!