JC Travels : మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయనకు చెందిన ట్రావెల్ బస్సులు మంటల్లో దగ్ధమయ్యాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది ఈ ఘటన. సమీపంలో ట్రావెల్స్ కార్యాలయం వద్ద నాలుగు బస్సులు నిలిపి ఉంచారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఒక బస్సు పూర్తిగా కాలిపోయింది. మరొకటి పాక్షికంగా కాలింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడ తెగిపడిన విద్యుత్ వైర్లు ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పలు రకాల అనుమానాలు ఉన్నాయి. జెసి దివాకర్ రెడ్డికి ట్రావెల్స్ వ్యాపారం ఎప్పటినుంచో ఉంది. వైసిపి ప్రభుత్వ హయాంలో ఈ వ్యాపారం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గాడిలో పడుతోంది.
* వైసిపి హయాంలో బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జెసి కుటుంబం నిర్వహిస్తున్న ట్రావెల్స్ వ్యాపారంపై ఫోకస్ పెట్టింది నాటి జగన్ సర్కార్. 2020లో ఏకంగా 76 వాహనాల రిజిస్ట్రేషన్ లను రద్దు చేసింది. బిఎస్ 3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బిఎస్ 4 గా మార్పు చేసి రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు అధికారులు నిర్ధారించారు. అప్పట్లో 60 వాహనాలను రవాణా అధికారులు సీజ్ చేశారు. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన బస్సులు, లారీలను రోడ్లపై నడుపుతున్నారంటూ అప్పట్లో జెసి కుటుంబానికి నోటీసులు కూడా జారీ చేశారు.
* ఇటీవలే ప్రభాకర్ రెడ్డి ఆవేదన
జెసి దివాకర్ రెడ్డి వయోభారంతో బాధపడుతున్నారు. రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి మాత్రం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజుల కిందట జెసి ప్రభాకర్ రెడ్డి మీడియా ముందు సంచలన కామెంట్స్ చేశారు. తమ కుటుంబ వ్యాపారం, రాజకీయ జీవితం ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తమ కేసులు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు అవస్థలు పడ్డామని.. ఇప్పుడు అనుకూల ప్రభుత్వం వచ్చినా ఫలితం లేకపోయిందన్న విధంగా అర్థం వచ్చేలా మాట్లాడారు. జాతీయస్థాయిలో బస్సులు నడిపిన మేము ఆ వ్యాపారాన్ని పోగొట్టుకున్నామంటూ వ్యాఖ్యానించారు. తమ లారీలు కూడా తమకు చెందకుండా పోయాయని వాపోయారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బస్సులు తగలబడటం అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా తగలబెట్టారా? ఇతరత్రా కారణాలతో తగలబెట్టుకున్నారా? అన్న అనుమానాలైతే మాత్రం వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జేసీ దివాకర్ రెడ్డి బస్సులు దగ్ధం
కేవీ 11 విద్యుత్ వైర్ తెగిపడటంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
బస్సుల వద్ద ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది pic.twitter.com/OJqWZBvrW6
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2025