YCP Leaders: గతసారి తెలుగుదేశం పార్టీకి ఎదురైన పరిణామాలే.. ఇప్పుడు వైసీపీకి దాపురించాయి. చంద్రబాబుకు సొంత కుటుంబం నుంచే సెగలు తగిలాయి నాడు. జూనియర్ ఎన్టీఆర్ అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. ఆయన మామ నార్నే శ్రీనివాసరావు టిడిపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వైసీపీలో చేరి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో చాలామంది నాయకుల కుటుంబాల్లో చీలిక తెచ్చి వైసీపీ లబ్ధి పొందింది అన్న ప్రచారం ఉంది. నాటి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరి ఎంత డ్యామేజ్ చేశారో తెలియంది కాదు.
అయితే ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అలానే ఉంది. సీఎం జగన్ కుటుంబంలోనే భారీగా చీలిక వచ్చింది. ఆ కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. చెల్లెలు షర్మిల, సునీత జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి ఇబ్బంది పెడుతున్నారని జగన్ కూడా చెప్పుకొస్తున్నారు. వైయస్ కుటుంబంలో సగం మంది జగన్ వెంట ఉండగా.. మిగతా వారు షర్మిల వెనుక నిలబడ్డారు. దీంతో సగటు వైఎస్ కుటుంబ అభిమాని బాధపడుతున్నాడు. ఎటు ఉండాలో తెలియక సతమతమవుతున్నాడు. ఈ పోరాటంలో ఆ కుటుంబం ఎక్కడ నవ్వుల పాలవుతుందోనని ఆందోళన చెందుతున్నాడు.
తాజాగా మంత్రి అంబటి రాంబాబు సొంత అల్లుడు.. మామ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయనను గెలిపించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఆయన వ్యక్తిత్వం విషయంలో చాలా విషయాలు బయట పెట్టాడు. ఇప్పుడు ఇదే వైరల్ గా మారింది. కొద్దిరోజుల కిందట విశాఖకు చెందిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమారుడు కూడా ఇలానే వ్యాఖ్యానించాడు. తన తండ్రిని గెలిపించవద్దని నేరుగా ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. మరోవైపు వైసీపీలోకి వెళ్లి జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని ముద్రగడ పద్మనాభం ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన కుమార్తె సైతం సోషల్ మీడియాలో తండ్రి వైఖరిని తప్పు పట్టడం విశేషం. పైగా తన తండ్రి ప్రత్యర్థులైన పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని, ఆయనకే తమ మద్దతు అని ప్రకటించడం విశేషం. అయితే ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలకు కుటుంబ పోటు ఎదురు కావడం మాత్రం ఇబ్బందికర పరిణామమే. గత ఎన్నికలకు ముందు టిడిపికి ఎదురైన పరిణామాలే.. ఇప్పుడు వైసీపీకి ఎదురు కావడం విశేషం.