Sattenapally Ground Report : ఏపీలో హాటెస్ట్ నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి. ఎంతోమంది యోధాను యోధులు ఈ నియోజకవర్గ నుంచి ప్రాతినిధ్యం వహించారు. గాంధేయవాది వావిలాల గోపాల కృష్ణయ్య, ఆమంచి నరసింహారావు వంటి వారు ఈ నియోజకవర్గానికి చెందిన వారే. మాజీ సీఎం భవనం వెంకట్రావుకు ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉంది. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ తొలి స్పీకర్ గా స్థానిక ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు ఎంపికయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి రాంబాబు మంత్రి అయ్యారు. ప్రస్తుతం అంబటి మరోసారివైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.కూటమి అభ్యర్థిగా మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలో దిగారు. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.
ప్రత్యర్థులు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో.. ఇక్కడ టైట్ ఫైట్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి జనసేన అదనపు బలం. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబటి రాంబాబు ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ స్థానికేతరుడు. కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు కూడా. గతంలో పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో గెలిచిన కన్నా మంత్రిగా కూడా వ్యవహరించారు. సత్తెనపల్లిలో సైతం మంచి సంబంధాలు ఉన్నాయి. 2019లో నరసరావుపేట ఎంపీగా బిజెపి నుంచి పోటీ చేసిన కన్నా ఓడిపోయారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎన్నికల అనంతరం పదవికి రాజీనామా చేశారు. టిడిపిలో చేరారు. దీంతో ఆయనకు సత్తెనపల్లి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. అప్పటినుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. టిడిపి నేతలను సమన్వయ పరచడంతో పాటు వైసీపీలోని అసంతృప్త నాయకులను తెలుగుదేశం పార్టీలోకి రప్పించారు.
అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి మండలంలోనూ ద్వితీయ శ్రేణి నాయకత్వం అంబటిని వ్యతిరేకిస్తోంది. ప్రతి పనికి రేటు పెట్టి వసూలు చేస్తున్నారన్న ఆరోపణ అంబటి పై ఉంది. చివరకు సీఎం సహాయనిధిలో సైతం చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. సంక్రాంతి సంబరాలు పేరిట డబ్బులు వసూలు చేశారని ఆయనపై కేసు కూడా నమోదయింది. ముఖ్యంగా సత్తెనపల్లిలో వసూళ్ల పర్వం నచ్చక ఆర్యవైశ్యులు వైసీపీకి దూరమయ్యారన్న ప్రచారం ఉంది. ఇవన్నీ ప్రతికూలంగా మారనున్నాయి.
అంబటి పై అభివృద్ధి కంటే.. వివాదాస్పద ముద్ర అధికంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. పవర్ స్టార్ అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది. మంత్రిగా మంచి అవకాశం దక్కిన సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై అంబటి పెద్దగా దృష్టి సారించ లేదన్న విమర్శ ఉంది. కేవలం ఆర్భాటాల కోసమే మంత్రి పదవిని ఉపయోగించుకున్నారని.. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను గాలికి వదిలేసారు అన్న అపవాదు అంబటి పై ఉంది. అయితే జగన్ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అంబటి నమ్మకంగా ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ స్థానికేతరుడు కావడం, కోడెల శివప్రసాద్ కుటుంబం సహాయ నిరాకరణ చేయడంతో.. విజయం తనదేనని అంబటి రాంబాబు ధీమాతో ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.