Family Rift Politics: రాజకీయం.. దాని పేరే రాజకీయం. ఎన్నో యుగాలుగా ఈ రాజకీయం రాజ్యమేలుతూ వస్తోంది. ఆధిపత్యం కోసం.. అధికారం కోసం నడిచే సమరమే రాజకీయం. ప్రజలకు సేవ చేయాలనుకునేవారు రాజకీయాల్లోకి వస్తారు. కానీ ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. మనుషులను, వ్యవస్థలను, చివరకు కుటుంబాలను అడ్డగోలుగా చీల్చేస్తుంది రాజకీయం. అలనాటి గాంధీ కుటుంబం నుంచి.. తాజాగా నేటి కేసిఆర్ కుటుంబం వరకు రాజకీయ చీలికలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెండ్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తెలుగు నాట నందమూరి తారక రామారావు, చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబాల్లో సైతం చీలిక వచ్చిన విషయాన్ని ఎక్కువ మంది ప్రస్తావిస్తున్నారు.
* 1995లో ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు జరిగింది. చంద్రబాబు చేతిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. అయితే ఎన్టీఆర్ మరణానంతరం నందమూరి హరికృష్ణ టిడిపి నుంచి సస్పెండ్ అయ్యారు. ఏకంగా హరికృష్ణ చంద్రబాబు నాయకత్వాన్ని సవాల్ చేశారు. దీంతో ఆయనపై బహిష్కరణ వేటు పడింది. అటు తరువాత అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు హరికృష్ణ. కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో తన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయవలసి వచ్చింది.
* కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అండదండగా నిలిచారు రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకు తగినంత ప్రాధాన్యం దక్కలేదు. దీంతో ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ అధ్యక్షురాలుగా మారారు. సోదరుడు జగన్మోహన్ రెడ్డి పైనే కాలు దువ్వుతున్నారు.
* తెలంగాణ తెచ్చిన నేతగా గుర్తింపు పొందారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణకు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి అధికారంలోకి వచ్చారు. కానీ 2023 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అప్పటినుంచి ఆ పార్టీ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పుడు పార్టీ లైన్ దాటిన ఆయన కుమార్తె కవిత సస్పెన్షన్కు గురయ్యారు. కెసిఆర్ కుమార్తెగా, ఉద్యమ నాయకురాలిగా పార్టీలోకి వచ్చారు. గత కొన్ని రోజులుగా సొంత పార్టీపై, పార్టీ నేతలపై చేస్తున్న కామెంట్లు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన కామెంట్స్ దుమారానికి కారణం అయ్యాయి. దీంతో కెసిఆర్ ఆదేశాల మేరకు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసిన నేతల కుటుంబాల్లో.. రాజకీయ చీలికలు సర్వసాధారణంగా మారాయి.