Homeఆంధ్రప్రదేశ్‌AP Cabinet Reorganisation: ఆ మంత్రులకు ఉద్వాసన.. ఏపీలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ!

AP Cabinet Reorganisation: ఆ మంత్రులకు ఉద్వాసన.. ఏపీలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ!

AP Cabinet Reorganisation: ఏపీలో మంత్రులను మారుస్తారా? మంత్రివర్గ విస్తరణ చేపడతారా? పునర్వ్యవస్థీకరణలో కొంతమందికి ఉద్వాసన తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఇలానే ఉన్నాయి. ఒకేరోజు మంత్రులకు సంబంధించి రెండు విషయాలు బయటపడ్డాయి. పార్టీ సభ్యత్వానికి సంబంధించి వెనుకబడ్డారని మంత్రి వాసంశెట్టి సుభాష్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరును తప్పుపట్టారు. ఇలా అయితే కష్టమని నిట్టూర్చారు. ప్రత్యామ్నాయం చూసుకుంటానని తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించి ఆడియో ఒకటి కలకలం సృష్టించింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ హోం శాఖ పనితీరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇలా అయితే తాను హోం శాఖను తీసుకుంటానని సంకేతాలు పంపారు. రివ్యూలు జరపాలని హోం శాఖ మంత్రి అనితకు సూచించారు. పోలీస్ వ్యవస్థ ఉదాసీన వైఖరిని తప్పు పట్టారు. అయితే ఓ మంత్రితో చంద్రబాబు మాట్లాడిన ఆడియో లీక్ అయిందంటే సామాన్య విషయం కాదు. మంత్రి వాసంశెట్టి సుభాష్ కు సొంత పార్టీలోనే వ్యతిరేకవర్గం ఉండాలి. లేకుంటే ఉద్దేశపూర్వకంగానే ఈ ఆడియోను లీక్ చేసి ఉండాలి. అటు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి సాటి హోంశాఖ పై బహిరంగంగా వ్యాఖ్యలు చేసి ఉంటారంటే తప్పకుండా దాని వెనుక వ్యూహం ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలతో మంత్రుల పనితీరుపై బలమైన చర్చ నడుస్తోంది. మంత్రుల ఉద్వాసన ఉంటుందన్న టాక్ నడుస్తోంది.

* పదిమంది కొత్త వారే
ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్లో 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. అయితే ఈసారి పదిమంది వరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. అదే సమయంలో నారాయణ, అచ్చెనాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి ఇలాంటి సీనియర్లకు కూడా అవకాశం కల్పించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సైతం దూకుడుగా ఉన్నారు. తమ శాఖలపై పట్టు సాధించారు. నిమ్మల రామానాయుడు తో పాటు పయ్యావుల కేశవ్ తమ సమర్థతను చాటుకున్నారు. అయితే మిగతా మంత్రుల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. వాస్తవానికి తొలి మూడు నెలలను శాఖలపై పట్టు సాధించేందుకు సమయం ఇచ్చారు చంద్రబాబు. కానీ ఇప్పటికీ కొందరు మంత్రులు పట్టు సాధించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

* చంద్రబాబు ఆగ్రహం
విజయనగరం జిల్లాలో డయేరియా ఘటన జరిగింది. దాదాపు 11 మంది మృత్యువాత పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అటువంటిదేమీ లేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ విషయంలో విపక్షాలను తిప్పి కొట్టడంలో జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో చంద్రబాబు సైతం తప్పు పట్టారని తెలుస్తోంది. తాజాగా వాసంశెట్టి సుభాష్ విషయంలో చంద్రబాబు ఆక్షేపించారు. అయితే అది ప్రభుత్వ పాలనకు సంబంధించింది కాదు. పార్టీ పరంగా హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే కొంతమంది కొత్త మంత్రుల తీరుపై అభ్యంతరాలు ఉన్నాయి.గతంలో వైసిపి మంత్రుల వ్యవహార శైలితోనే ఇబ్బందులను తెచ్చుకుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సైతం అదే ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంకేతాలన్నీ చూస్తుంటే మంత్రివర్గ విస్తరణ తప్పదన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే కొంతమంది జూనియర్లకు ఉద్వాసన తప్పదు. మరి చంద్రబాబు ఆలోచన ఏంటో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version