CBI Arrests: దివంగత డీకే ఆదికేశవుల నాయుడు( Dk Aadi keshavula Naidu ) పేరు మరోసారి ప్రముఖంగా వినిపించింది. ఆయన వారసులు సిబిఐ వలలో పడ్డారు. 2019లో జరిగిన రియల్ట రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో ఆది కేశవులు కుమారుడు డీకే శ్రీనివాస్, కుమార్తె కల్పజాను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. వీరితోపాటు అప్పటి డిఎస్పి మోహన్ ను కూడా అదుపులో తీసుకున్నారు. రఘునాథ మృతి వెనుక ఆర్థిక లావాదేవీలు, బెదిరింపులు ఉన్నాయన్న ఆరోపణలపై సుదీర్ఘ దర్యాప్తు కొనసాగింది. అందులో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయి. రాజకీయంగా దూరంగా ఉన్న డీకే కుటుంబం ఇప్పుడు ఈ ఘటనతో మళ్లీ వెలుగులోకి వచ్చింది.
ఆరేళ్ల క్రితం..
2019 నాటి కేసు ఇది. డీకే ఆదికేశవులు నాయుడుకు సన్నిహితుడు రఘునాథ్(Raghunath). ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మొదట బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో దర్యాప్తును సిబిఐ చేశారు. సుప్రీంకోర్టు సైతం సీబీఐ దర్యాప్తునకు ఓకే చెప్పడంతో రంగంలోకి దిగిన అత్యున్నత విచారణ సంస్థ ఈ కేసులో విచారణ చేపట్టింది. అందుకే కీలక అరెస్టులు జరిపినట్లు తెలుస్తోంది. టిటిడి చైర్మన్ పోస్ట్ తో పాటు తిరుపతి ఎంపీగాను పనిచేశారు డీకే ఆదికేశవులు నాయుడు. సుదీర్ఘకాలం టిడిపిలోనే పనిచేశారు.
అనుమానాస్పద మృతి
డీకే ఆదికేశవుల నాయుడుకు కర్ణాటకలో( Karnataka) విలువైన ఆస్తులు ఉండేవట. బెంగళూరు తో పాటు ఇతర ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉండేవని తెలుస్తోంది. మరోవైపు రఘునాథ్ కూడా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో స్థితిమంతుడుగా ఉండేవారు. 2013లో ఆదికేశవులు మృతి చెందిన తర్వాత రఘునాథ్ ఆయనకు చెందిన అనేక ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకున్నారు. వాటిని తమ పేర్ల మీద బదలాయించాలని.. తండ్రి ఆస్తులకు తాము వారసులమని అప్పట్లో శ్రీనివాస్, కల్పజ, మరికొందరు రఘునాథ్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2019 మే లో రఘునాథ్ అనుమానాస్పద స్థితి లో మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితులుగా ఉన్న ఆది కేశవులు వారసులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి దర్యాప్తును నీరుగాచుతున్నారని మృతుడి బంధువులు ఆరోపించారు. ఈ కేసును సిబిఐ కి బదలాయించాలంటూ కర్ణాటక కోర్టుకు ఆశ్రయించారు. సిబిఐ రంగంలోకి దిగడంతో వీరి అరెస్టు జరిగింది. డీకే ఆదికేశవులు టిడిపి నుంచి ఎంపీ అయ్యారు. టీటీడీ చైర్మన్ గాను వ్యవహరించారు.