Anil Kumar Yadav: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను( Anil Kumar Yadav) పక్కన పెట్టేసినట్టేనా? ఆయనతో లాభం లేదని జగన్మోహన్ రెడ్డి భావించారా? అందుకే ఆయనను పట్టించుకోవడం మానేశారా? ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు అనిల్. కానీ టిడిపి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఓడిపోయారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఎన్నికల్లో చెప్పుకొచ్చారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత ప్రకటన చేయలేదు కానీ.. రాజకీయాల్లో మాత్రం కనిపించకుండా మానేశారు. అయితే ఇప్పుడు నెల్లూరు సిటీ బాధ్యతలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్. నెల్లూరు రూరల్ జిల్లా బాధ్యతలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇచ్చారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ ను మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయనను దాదాపు పక్కన పెట్టినట్టేనని వైసీపీ శ్రేణులు సైతం భావిస్తున్నాయి.
* అనిల్ తీరుతో చాలా నష్టం
అనిల్ కుమార్ యాదవ్ తీరుతోనే నెల్లూరు జిల్లాలో( Nellore district) వైసీపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి అన్నది ప్రధాన ఆరోపణ. దీనిపైనే జగన్మోహన్ రెడ్డికి నివేదికలు అందినట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినా.. నెల్లూరు జిల్లాలో మాత్రం వైసిపి స్పష్టమైన హవా చూపింది. 2019 ఎన్నికల్లో మాత్రం జిల్లాలో వైట్ వాష్ చేసింది. క్లీన్ స్వీప్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అన్ని నియోజకవర్గాల్లోనూ విజయం సాధించింది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సీన్ మారింది. మొత్తం కూటమి అన్ని స్థానాలను గెలుచుకుంది. అయితే దీనికి అనిల్ కుమార్ యాదవ్ తీరు కారణమని విమర్శలు ఉన్నాయి.
* అందరూ కీలక నేతలే
నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో చాలామంది కీలక నాయకులు ఉండేవారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇలా బలమైన నేతలతో బలీయమైన శక్తిగా ఉండేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యారు. చాలా దూకుడుగా వ్యవహరించారు. ఫలితంగా ఈ నేతలంతా తీవ్ర ఇబ్బంది పడ్డారు. తమ ఇబ్బందులను అధినేత జగన్మోహన్ రెడ్డికి వివరించారు. కానీ ఆయన పట్టించుకోలేదు. పైగా అనిల్ కుమార్ యాదవ్ కు ప్రోత్సహించారు. దీంతో బలమైన నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.దాని ప్రభావం 2024 ఎన్నికలపై కనిపించింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అనిల్ కుమార్ వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డికి బోధపడింది. అందుకే అనిల్ కుమార్ యాదవ్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
* నెల్లూరు వైపు చూడలే
ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో లేరు అనిల్ కుమార్ యాదవ్. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ లెక్కన నరసరావుపేట( narasarao Peta ) పార్లమెంట్ స్థానం ఇన్చార్జిగా అనిల్ కుమార్ యాదవ్ ఉండాలి. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన నరసరావుపేట వైపు కూడా చూడడం లేదు. అలాగని నెల్లూరు సిటీలో కూడా కనిపించడం లేదు. రాష్ట్రానికి దూరంగా ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సైతం నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ కు చాన్స్ ఇవ్వలేదు. దీంతో అనిల్ సైతం రాజకీయంగా సైలెంట్ కావడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మున్ముందు పరిణామాలు ఎలా చోటు చేసుకుంటాయో చూడాలి.