Alla Ramakrishna Reddy: ఏపీలో వైఎస్ షర్మిల టీం సిద్ధమవుతోందా? వైసిపి బాధితులంతా ఆమె గూటికి చేరనున్నారా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మారనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్ది రోజుల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కానుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల నియమితులు కానున్నారు. ఈ ప్రక్రియ అంతా లాంఛనమేనని.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని ఢిల్లీ సంకేతాలు వస్తున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న మరుక్షణం.. చాలామంది నాయకులు టర్న్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వైఎస్ కుటుంబ అభిమానులు, జగన్ వద్ద ఆదరణ లేని నాయకులు షర్మిల గూటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు వైసీపీ నేతలు చాలామంది ఆహ్వానించారు. తమ అభిమాన నేత బిడ్డగా ఆశీర్వదించారు. అయితే జగన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో చాలామంది సైలెంట్ అయ్యారు. ఎక్కడ అధినేతకు ఆగ్రహం వస్తుందోనని అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో చాలామందికి టిక్కెట్లు ఇవ్వడం లేదు. అందులో వైయస్ కుటుంబ అభిమాన నేతలు కూడా ఉన్నారు. వారు తమకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ప్రత్యామ్నాయ వేదికగా మారనున్న షర్మిల చెంతకు చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వైయస్ కుటుంబానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంతో సన్నిహితుడు. అటువంటి వ్యక్తిని ఇటీవల జగన్ పక్కన పెట్టారు. దీంతో జీర్ణించుకోలేకపోయినా ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఏ పార్టీకి వెళ్లేందుకు ఆప్షన్ లేదు. ఎందుకంటే చంద్రబాబుపై వ్యక్తిగతంగా కూడా రామకృష్ణారెడ్డి తో కేసులు వేయించారు జగన్. అధినేత కళ్ళల్లో ఆనందం చూసేందుకు రామకృష్ణారెడ్డి కోర్టు మెట్లు ఎక్కారు. కానీ అంతగా తన గురించి పరితపించిన రామకృష్ణారెడ్డిని జగన్ పక్కకు పెట్టారు. కనీసం సర్దుబాటు కూడా చేయలేదు. దీంతో ఆయన షర్మిల వెంట నడిచేందుకు డిసైడ్ అయ్యారు. నేరుగా విలేకరుల సమావేశం పెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో ఉన్న జగన్ ఫ్లెక్సీలు తొలగించారు. వైయస్ విజయమ్మతో పాటు షర్మిల ఫ్లెక్సీలను మాత్రమే ఉంచారు. ఇకనుంచి తన ప్రయాణం షర్మిల వెంటేనని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా? లేదా? అన్నదానిపై స్పష్టత రాలేదని చెప్పుకొచ్చారు. షర్మిల ఇంకా కాంగ్రెస్ పగ్గాలు తీసుకొని విషయాన్ని గుర్తు చేశారు. ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. తాను అనుసరిస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించడం విశేషం. నాలుగు సంవత్సరాలుగా తనను నిర్లక్ష్యం చేశారని.. సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి కాదు.. చాలామంది వైసిపి నేతలు షర్మిల వెంట నడుస్తారని ప్రచారం జరుగుతోంది. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో… ప్రత్యామ్నాయంగా టిడిపి, జనసేన వైపు వెళ్లలేని వారంతా షర్మిల కోసం ఎదురుచూస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే మాత్రం ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.