Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) కృషి ఫలించింది. కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులు ఏపీకి వస్తున్నాయి. మదపు తేనుగుల దాడులను నియంత్రించేందుకు ఈ కుంకీ ఏనుగులు ఉపయోగపడనున్నాయి. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ ఈ కుంకీ ఏనుగుల కోసం కర్ణాటకకు వెళ్లారు. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను ఏపీకి అప్పగించింది. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ అభినందనలు అందుకుంటోంది. అడవి ఏనుగుల దాడులతో ఇబ్బంది పడుతున్న ఏపీ రైతులకు ఇక ఊరట లభించే అవకాశం ఉంది.
* సరిహద్దు ప్రాంతాల్లో సంచారం..
ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో మదపుటేనుగుల ప్రభావం ఎక్కువ. సమీప అడవుల నుంచి వచ్చిన ఏనుగులు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. ఊర్ల మీద పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు ఆస్తి నష్టం తో పాటు ప్రాణం నష్టం తప్పడం లేదు. ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గత ఏడాది ఆగస్టులో కర్ణాటకలో పర్యటించి సీఎం సిద్ధరామయ్య తో పాటు డిప్యూటీ సీఎం శివకుమార్ తో చర్చలు జరిపారు. అప్పట్లో వారు సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఏనుగులు పంపించడంతో ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉంది.
Also Read : ఆ రెండు జిల్లాల్లో కూటమి పరిస్థితి ఇలా.. సంచలన సర్వే
* పవన్ సమక్షంలో..
బెంగళూరులోని విధాన సౌధలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య( Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది. వాస్తవానికి ఆరు కుంకీ ఏనుగులను అప్పగించాల్సి ఉన్నప్పటికీ.. రెండు ఏనుగులు అనారోగ్య కారణాల రీత్యా… కేవలం నాలుగు ఏనుగులు మాత్రమే అప్పగించారు. మరో విడతలో మిగతా రెండు ఏనుగులను అప్పగించనున్నారు. ఏపీకి అప్పగించిన ఈ ఏనుగుల పేర్లు దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర. వీటిని చిత్తూరు జిల్లా పలమనేరులోని ఎలిఫెంట్ హబ్ కు తరలిస్తారు.
* అటవీ ఏనుగులను నియంత్రించేందుకు..
దేశవ్యాప్తంగా అటవీ ఏనుగులను నియంత్రించేందుకు ఈ కుంకీ ఏనుగులను( Kumki elephants ) ప్రయోగిస్తారు. ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఎక్కువ. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణ నష్టం తో పాటు పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ చూపడంతో కర్ణాటక ఈ కుంకి ఏనుగులను ఏపీకి అప్పగించింది. వివిధ జిల్లాల్లో ఏనుగుల సమస్యకు వీటితో పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉంది.