Electricity Charges Reduced In AP: ఏపీలో( Andhra Pradesh) విద్యుత్ చార్జీలు తగ్గాయి. ఈ నెల నుంచి చార్జీలు తగ్గింపు కనిపిస్తోంది. ఈ నెలలో వాడిన యూనిట్లను అనుసరించి.. ఒక్కో యూనిట్కు 13 పైసలు తగ్గిస్తూ బిల్లులు జారీ చేశారు. కరెంటు బిల్లులో ఇది స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ రాయితీ కింద ట్రూ డౌన్ చార్జీలు చూపించారు. గతంలో వైసీపీ హయాంలో ట్రూ ఆఫ్ చార్జీల పేరిట భారీగా బాదేశారు. అందుకే కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ చార్జీల పేరిట విద్యుత్ చార్జీలను తగ్గించింది. ఒక ఏడాది పాటు ఈ ట్రూ డౌన్ చార్జీలు కొనసాగుతాయి. ట్రూ ఆఫ్ పేరిట వసూలు చేసిన చార్జీలు.. తిరిగి ప్రజలకు చెల్లించిన తరువాత.. నెలలో వాడిన విద్యుత్ చార్జీలకు తగ్గట్టు బిల్లులు వసూలు చేస్తారు. సాధారణంగా ప్రభుత్వం ఒకసారి వసూలు చేసిన చార్జీలను ఇవ్వడం కుదరని పని. కానీ టిడిపి సర్కార్ మాత్రం ఆ పని చేసి చూపిస్తోంది.
* ట్రూ డౌన్ పేరిట తిరిగి వినియోగదారులకు..
ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్( AP electricity regulation Commission ) ఆదేశాల ప్రకారం.. వైసీపీ హయాంలో వసూలు చేసిన ట్రూ ఆఫ్ చార్జీలను.. ట్రూ డౌన్ చార్జీల పేరిట వినియోగదారులకు తిరిగి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో ట్రూ ఆఫ్ చార్జీల పేరిట తొమ్మిది వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు. వాటిని ఇప్పుడు వినియోగదారులకు చెల్లిస్తున్నారు. నవంబర్ నెల కు సంబంధించి వచ్చిన బిల్లుల్లో గవర్నమెంట్ సబ్సిడరీ కింద ఈ ట్రూ డౌన్ చార్జీల చెల్లింపులు జరుగుతున్నాయి. మరో ఏడాది పాటు ప్రతి నెలలో ఈ సబ్సిడరీ పేరిట చెల్లింపులు జరుగుతాయి. ఈ తొమ్మిది వందల కోట్ల రూపాయల చెల్లింపులు తరువాత.. యధా స్థానంలో వాడిన విద్యుత్కు తగ్గట్టు మాత్రమే బిల్లులు ఇస్తారు. అప్పుడు ఎటువంటి గందరగోళం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
* వైసిపి ప్రభుత్వం అయితే వేరే చెల్లింపులు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నిర్వాకం పుణ్యమే ఈ చెల్లింపులు. అయితే ఇదే వైసిపి ప్రభుత్వంలో ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఉంటే.. వేరే పద్దు కింద ఈ 900 కోట్ల రూపాయలు జమ అయ్యేది. కానీ టిడిపి ప్రభుత్వం మాత్రం తిరిగి వినియోగదారులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రభుత్వం వసూలు చేసే ఏ పన్ను కానీ.. చార్జీలు కానీ వెనక్కి ఇచ్చేందుకు సమ్మతం తెలపవు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన పాపం తమకు అంటకూడదని కూటమి సర్కార్ భావించింది. అందుకే ట్రూ ఆఫ్ చార్జీల పేరిట వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు నిర్ణయించింది. సరిగ్గా ఏడాదిలో ఈ బిల్లులోనే సర్దుబాటు చేయనున్నారు. ఏపీ ప్రజలకు 900 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందన్నమాట.