TDP High Command: టిడిపిలో( Telugu Desam Party) చాలామంది ఎమ్మెల్యేల అధికారాలకు కత్తెర పడినట్లు తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగాలేదు. ముఖ్యంగా మొదటిసారి గెలిచిన వారి విషయంలో మాత్రం అభ్యంతరకర ప్రవర్తన ఉంది. పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత ఉంది. అందుకే చంద్రబాబుతో పాటు లోకేష్ కఠినంగా మాట్లాడుతున్నారు. మారుతారా? మార్చేయమంటారా? అన్న రీతిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముందుగా చెప్పి చూశారు. కానీ వారు వినకపోయేసరికి సరికొత్త రూట్ లో వెళ్తున్నారు. అధికారాలకు కత్తెర వేసి.. ప్రోటోకాల్ విషయంలో గట్టి సంకేతాలే పంపుతున్నారు. తద్వారా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే మంత్రి పదవులు దక్కలేదన్న సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు జిల్లాల్లో గ్రూపులు కడుతున్నారు. అటువంటి వారికి సైతం గట్టి హెచ్చరికలే తగిలాయి. నువ్వు కాకుంటే ప్రత్యామ్నాయం ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి.
* సీనియర్లు సైతం..
శ్రీకాకుళం జిల్లాకు( Srikakulam district) చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే వైఖరి అస్సలు బాగోలేదు. ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. మంత్రి పదవి దక్కించుకున్న నేతపై ఆగ్రహంతో శాసనసభ నుంచి జిల్లా పరిషత్ సమావేశం వరకు అధికారుల రూపంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. పైగా పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారు. ఆయనపై హై కమాండ్ కు ఫిర్యాదు వెళ్లడంతో చంద్రబాబుతో పాటు లోకేష్ సీరియస్ అయ్యారు. పైగా కుల రాజకీయాలకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణ ఆయనపై ఉంది. ఆయన విషయంలో హై కమాండ్ సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలానే అన్ని జిల్లాల నుంచి కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు ఉన్నాయి.
* మారకపోతే అంతే..
ఇటీవల ఓ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం ఉంది. అలాగని వారిపై నేరుగా చర్యలు తీసుకునే ఉద్దేశం కాదు. ఉదాసీనత కూడా చూపరు. మారాలని మాత్రమే సూచించారు. సొంత చరిష్మాతో గెలిచామన్న భ్రమలను తొలగించుకోవాలని.. అటువంటివారు బయటకు వెళ్లి తమను తాము నిరూపించుకోవాలని కూడా చంద్రబాబు సూచించారు. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని గట్టి హెచ్చరికలు పంపారు. అయితే ఇప్పుడు ఆ 48 మంది ఎమ్మెల్యేల్లో కొత్తగా గెలిచిన వారి నుంచి అసలు సమస్యలు. అందుకే వారి స్థానంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
* లెక్కలేని తనంలో ఎమ్మెల్యేలు..
చాలామంది ఎమ్మెల్యేలు హై కమాండ్ అంటే లెక్కలేనితనంగా ఉంటున్నారు. దీనిని ఆదిలోనే కట్టడి చేయాలని చంద్రబాబు( CM Chandrababu) భావిస్తున్నారు. అతిగా ప్రవర్తించే ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఉన్నారు. అయితే ముందుగా వారి గురించి స్టడీ చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా త్వరలో మీడియా కథనాలు కూడా ప్రారంభం అవుతాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. వారిపై బలమైన ముద్ర వేసి బయటకు పంపితే మిగతావారు భయపడతారు అన్నది టిడిపి హై కమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే అంత గాబరా పడిపోవాల్సిన అవసరం లేదు కానీ.. టిడిపి హై కమాండ్ కొంతమంది ఎమ్మెల్యేలపై సీరియస్ గా ఉన్న మాట వాస్తవం.