Election Commission: ఏపీలో ఎన్నికలు హింసాత్మక ఘటనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. బాధ్యులైన అధికారులపై వేటు వేసింది. కొందరిని సస్పెండ్ చేసింది. మరికొందరు పై బదిలీ వేటు పడింది. అదే సమయంలో అల్లర్లపై అత్యున్నత అధికారుల బృందం సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వేటుపడిన అధికారుల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పంపించిన పేర్ల నుంచి వారిని ఎంపిక చేసింది. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
పల్నాడు జిల్లా కలెక్టర్ గా ఉన్న లోతోటి శివశంకర్ ను బదిలీ చేసిన ఎలక్షన్ కమిషన్ కొత్త కలెక్టర్ గా శ్రీ కేష్ బాలాజీ లత్కర్ ను నియమించింది. పల్నాడు ఎస్పీగా ఉన్న బిందు మాధవ్ ను సస్పెండ్ చేసి.. ఆ స్థానంలో మల్లిక గార్గ్ ను నియమించింది. తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. వీరిని తక్షణమే ఆయా పోస్టుల్లో చేరాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆదివారం ఉదయానికి తమకు మళ్ళీ నివేదిక పంపించాలని కోరింది.
మరోవైపు వినీత్ బ్రెజిలాల్ ఆధ్వర్యంలోని 13 మంది అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్.. విచారణను ప్రారంభించింది. కల్లోలి త ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు వెలికితీస్తోంది. అసలు ఘటనలను ఎందుకు అడ్డుకోలేక పోయారు? దీని వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టింది దర్యాప్తు సంస్థ. అయితే ప్రాథమిక దర్యాప్తు పూర్తి కావడంతో పూర్తిస్థాయి నివేదికలను ఎన్నికల సంఘానికి అప్పగించినట్లు సమాచారం. కాగా ఈ ఘటనలకు కారణమైన వారిగా అనుమానిస్తున్న రాజకీయ పార్టీల నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి వివరాలను సైతం రాబట్టే పనిలో సిట్ బృందం ఉంది.