Kadapa MLA Madhavi Reddy : కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఇప్పుడు శివంగిలా మారుతున్నారు. వైసిపి పై గట్టి యుద్ధమే ప్రారంభించారు. నిన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పై గెలుపొందారు మాధవి రెడ్డి. అయితే ఏదో కూటమి ప్రభంజనంలో గెలిచారని లైట్ తీసుకుంది వైసిపి. కడప కార్పొరేషన్ లో మనదే బలం కదా.. ఆమె ఏం చేస్తుంది లే అని భావించారు. కడప మేయర్ సురేష్ బాబు ఆమెను చాలా చులకనగా చూశారు. ఆమె ఎమ్మెల్యే అయితే.. నేను మేయర్ ను కదా అని కాస్త దర్పం ప్రదర్శించారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మాధవి రెడ్డికి సీటు కేటాయించలేదు. చాలా అవమానించారు. కేవలం కార్పొరేషన్ లో టిడిపికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని మాధవి రెడ్డి గ్రహించారు. అప్పటినుంచి పావులు కదపడం ప్రారంభించారు.ఏకంగా కడప మేయర్ పీఠంపై గురి పెట్టారు. అందులో భాగంగానే ఈరోజు ఎనిమిది మంది కార్పొరేటర్లు టిడిపిలో చేరనున్నారు.
* విజయవాడకు 8 మంది కార్పొరేటర్లు
కడప కార్పొరేషన్ లో 50 డివిజన్లో ఉన్నాయి. ఒక డివిజన్లో టిడిపి, మరో డివిజన్లో జనసేన విజయం సాధించాయి. 48 మంది కార్పొరేటర్లతో వైసిపి పటిష్టమైన స్థానంలో ఉంది. పైగా ఆ కార్పొరేటర్లంతా వైసిపి కీలక నేతల అనుచరులే. పార్టీ అంటే విపరీతమైన అభిమానం ఉన్నవారే. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలామంది మనసు మారింది. అదే సమయంలో తనను అవమానించిన వైసీపీకి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. వైసీపీలో అసంతృప్తుల జాబితాను తెప్పించుకున్నారు. ఈ ఐదేళ్లలో అధికారంతో పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో వారు యూటర్న్ తీసుకున్నారు. కీలక నేత అనుచరులే అయినా.. టిడిపిలో చేరేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతానికి ఎనిమిది మంది మాత్రమే చేరుతున్నారు. కానీ దానికి మించి అసంతృప్తులు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* రెచ్చగొడితే ఇలానే ఉంటుంది
రాజకీయాల్లో రెచ్చగొట్టే ధోరణి ఉంటే నష్టం తప్పదు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అదే. ఎమ్మెల్యేగా గెలిచిన మాధవి రెడ్డికి గౌరవం ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కేవలం నగర పాలక సంస్థ సమావేశంలో తనకు గౌరవం ఇవ్వకపోవడాన్ని సవాల్ గా తీసుకున్నారు. వైసీపీకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చూసారు. ఇప్పుడు యాక్షన్ లోకి దిగారు. 8 మంది కార్పొరేటర్ లను తమ వైపు తిప్పుకొని విజయవాడ బయలుదేరారు. అయితే ఆ ఎనిమిది మందితో ఆగిపోరని.. చాలామంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.