Eenadu Paper: ఒకప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఈ స్థాయిలో లేదు. పైగా పాత్రికేయులు ఇంతగా లేరు. వార్త విషయంలో ఓ స్పష్టమైన అవగాహన పాత్రికేయులకు ఉండేది. యాజమాన్యాలు కూడా ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉండేది. అందువల్లే వార్తలు..వార్తల మాదిరిగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యజమాన్యాలకు రాజకీయరంగులు అలవడ్డాయి. ఏకంగా రాజకీయాలను శాసించే స్థాయికి మీడియా సంస్థలు ఎదిగిపోయాయి. ఈ క్రమంలోనే జర్నలిజం అనేది అనేక రకాలుగా మారిపోయింది. సమాజ సేవ నుంచి పక్కా వ్యాపారం లాగా మారిపోయింది. అయితే ఈ వ్యాపారంలో ఎవరు ఎక్స్క్లూజివ్ గా వార్తలు ఇస్తే వారే తోపు.
పైగా ఇప్పుడు సోషల్ మీడియా కాలం కాబట్టి ఎక్స్క్లూజివ్ వార్తలు ఇచ్చినప్పటికీ కూడా కాపీ పేస్ట్ అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. సోషల్ మీడియా కాలంలో పేటెంట్ రైట్ అనేది లేకుండా పోయింది. అలాగని మీడియా సంస్థలు వివిధ ఏజెన్సీల నుంచి కూడా వార్తలు తీసుకుంటాయి. అందులో కొన్ని సంస్థలు ఇతర మార్గాల నుంచి వార్తలు తీసుకున్నప్పటికీ తామే సొంతంగా రాసినట్టు ప్రచారం చేసుకుంటున్నాయి. అంతేకాదు ఆ వార్తలను ఎవరైనా సామాజిక మాధ్యమాలలో.. ఇతర వేదికలలో పోస్ట్ చేస్తే తప్పుపడుతున్నాయి.. దీనికి సంబంధించి న్యాయపరంగా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి.. ఈ జాబితాలో కేవలం తమిళ పత్రికలు.. హిందీ పత్రికలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇందులోకి తెలుగు పత్రికలు కూడా చేరిపోయాయి.
తెలుగు పత్రికల్లో ఈనాడు సర్కులేషన్ పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. అయితే ఈ పత్రిక తాజాగా ఒక ప్రకటన చేసింది.. ఇటీవల కాలంలో తమ పత్రికలో ప్రచురితమైన కథనాలను యాజమాన్యం అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఒక లీగల్ ప్రకటన విడుదల చేసింది.. ఇటువంటి చర్యలకు పదేపదే ఉపక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. నేటి సోషల్ మీడియా కాలంలో.. రకరకాల యాప్స్ అందుబాటులోకి వచ్చిన క్రమంలో.. కాపీ పేస్ట్ చేయకుండా సాధ్యమవుతుందా? వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా కట్టడి చేయగలరా? ఈ ప్రశ్నలకు ఆ మేనేజ్మెంట్ సమాధానం చెప్పగలదా?
హిందీలో ప్రఖ్యాత మీడియా సంస్థ నుంచి ప్రకరితమవుతున్న ఓ పేపర్ కూడా ఇలానే లీగల్ నోటీసులు పబ్లిష్ చేసింది. కానీ ఆ తర్వాత అసలు వాస్తవం తెలిసి దానిని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఈనాడుకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందనడం లో ఎటువంటి సందేహం లేదు. నేటి సోషల్ మీడియా కాలంలో కాపీ పేస్ట్ అనేది సర్వసాధారణం. అలాగని దానిని మేము సమర్థించడం లేదు. అది గొప్ప పని అని కూడా చెప్పడం లేదు. కాకపోతే అనేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. దీనిని ఈనాడు యాజమాన్యం ఏ విధంగా అడ్డుకుంటుంది? 7 రూపాయలు పెట్టి పేపర్ కొనుగోలు చేసిన తర్వాత.. కొనుగోలు చేసిన వ్యక్తికి అన్ని హక్కులు లభిస్తాయి. అలాంటప్పుడు ఈనాడు యాజమాన్యం కాపీ పేస్ట్, పోస్ట్ లను ఎలా ఎదుర్కొంటుందనదే ఇక్కడ అసలు ప్రశ్న.