Ponnam Prabhakar Comments On Kalyana Lakshmi: ఒకప్పుడు ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేవారు.. కానీ ఇప్పుడు సమస్యల పరిష్కారాన్ని పక్కనపెడుతున్నారు. అసలు సమస్యను ప్రస్తావించడానికి కూడా నాయకులు ఒప్పుకోవడం లేదు. కేవలం సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు. ఉచితంగా బియ్యం.. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం.. ఉచితంగా విద్యుత్తు.. ఉచితంగా గ్యాస్.. పింఛన్లు పంపిణీ చేస్తూ రాష్ట్ర ఖజానాలను దివాలా తీయిస్తున్నారు. దీంతో బడ్జెట్ మొత్తం అప్పులకు.. వడ్డీ చెల్లింపులకు.. సంక్షేమ పథకాలకు మాత్రమే సరిపోతుంది. దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే డబ్బులు లేకపోవడంతో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకు పోతున్నాయి.
Also Read: మగాళ్ళు కొట్టలేదు.. మన ఆడబిడ్డలు కప్ కొట్టి చూపించారు..
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. అందులో ప్రధానమైనది కళ్యాణ లక్ష్మి పథకం లో భాగంగా ఆడవాళ్లకు లక్ష రూపాయలు చెక్కుతో పాటు, తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ప్రభుత్వం తులం బంగారం ఇవ్వలేకపోయింది. కేవలం ప్రభుత్వం ద్వారా వచ్చే లక్ష రూపాయల చెక్కును మాత్రమే అందిస్తోంది. దీనిపై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అలవికాని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తోంది.
ఇదే విషయాన్ని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ లో పనిచేసే సీనియర్ జర్నలిస్టు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా.. తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన శాఖకు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ను ప్రశ్నించారు. దీనిపై పొన్నం ప్రభాకర్ నీళ్లు నమిలారు. బంగారం తులం ధర లక్ష రూపాయలకు మించి ఉండడంతో తాము ఆ హామీని అమలు చేయలేకపోతున్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇప్పుడంటే తులం బంగారం ధర లక్షకి మించి ఉంది. కానీ సరిగా రెండు సంవత్సరాల క్రితం బంగారం ధర ఈ స్థాయిలో లేదు. అయినప్పటికీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం బంగారాన్ని ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఆగ్రహా వేషాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి కల్యాణ లక్ష్మికి ప్రతి ఏడాది బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి.. వాటి ఆధారంగానే ఖర్చులు జరుగుతుంటాయి. వాటి గురించి తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తులం బంగారం హామీ ఇవ్వడం విశేషం. పైగా ఆ హామీని నిలబెట్టుకోలేక ఇప్పుడు నానా తంటాలు పడుతుండడం గమనార్హం. పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను గులాబీ పార్టీ సోషల్ మీడియా విభాగం విపరీతంగా సర్కులేట్ చేస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల అసలు ముఖచిత్రం అంటూ ఆరోపిస్తోంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ తులం బంగారం ఇవ్వలేం!
మేము తులం బంగారం ప్రకటించినప్పుడు రూ.50 వేలు ఉండేది.. ఈ రోజు 1లక్ష 50వేలు అయింది
తులం బంగారం విషయం గురించి వదిలేయండి – మంత్రి పొన్నం ప్రభాకర్
Video Credits – Tv9 pic.twitter.com/PQ5BCzshef
— Telugu Scribe (@TeluguScribe) November 3, 2025