AP Volunteers: వాలంటీర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సచివాలయ రాష్ట్ర కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తోంది. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రక్రియలో పాల్గొన్నా.. ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండకూడదు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అధికార వైసిపి అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. దీంతో చాలామంది వాలంటీర్లు అభ్యర్థులతో ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనిపై మీడియాలో ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఇటీవల హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. అటు ఎన్నికల సంఘం కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించవద్దని ఎన్నికల సంఘం ఇటీవలే ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్ర పైన కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల ఎన్నికల విధులకు అనుమతి ఇచ్చినా.. ఓటర్లకు ఇంకుపోసే పనికి మాత్రమే పరిమితం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
బిఎల్వోలుగా విధులు నిర్వహించిన వారికి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించవద్దని కూడా ఆదేశించింది. వలంటీర్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్నందున.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి అవకాశాలు ఉన్నాయని గతంలోనే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో గతంలో జరిగిన ఎన్నికల్లోను వాలంటీర్లకు విధులు కేటాయించలేదు. అయితే వరుసగా వచ్చిన ఫిర్యాదులు, కోర్టు ఆదేశాలు, ఈసీ స్పష్టమైన ఆదేశాలతో ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున వాలంటీర్లు అధికార పార్టీ సేవలో తరిస్తున్నందున.. మున్ముందు ఇదో జఠిల సమస్యగా మారనుంది.