AP- Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికల అన్న మాట చాలారోజుల నుంచి వినిపిస్తోంది. అటు ప్రభుత్వ చర్యలు.. అదే సమయంలో విపక్షాల హడావుడి చూస్తే ముందస్తు తప్పదన్న సంకేతాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఏడాది కిందట నుంచే ముందస్తు ప్రచారం ఊపందుకున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకుండా పోయింది. విపక్షాలను ఇరుకున పెట్టాలనో.. లేకుంటే వ్యూహంలో భాగమో తెలియదు కానీ.. ముందస్తు హడావుడి చేసి.. తరువాత జగన్ తన పనితాను కామ్ గా చేసుకుంటున్నారు. అయితే తాజాగా ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దానికి తగ్గట్టుగానే ప్రముఖులు అనుమానం వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టుగా విశ్లేషణ చేస్తున్నారు. దానిని కొనసాగింపుగా ప్రభుత్వ పెద్దలు కూడా ముందస్తు తప్పవన్న సంకేతాలిస్తున్నారు.సీఎం జగన్ కూడా స్పీడు పెంచారు. వరుసగా ఎమ్మెల్యేలకు వర్కుషాపు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తానని చెబుతున్నారు. ప్రజల్లో ఉండాలని హితబోధ చేస్తున్నారు. టీడీపీకి చెందిన బలమైన నియోజకవర్గాలపై కూడా ఫోకస్ పెంచారు. ఇప్పటికే అక్కడ ఐప్యాక్ టీమ్ ను రంగంలోకి దింపారు.

అటు చంద్రబాబు కూడా అదే దూకుడును కనబరుస్తున్నారు. అభ్యర్థులను ఖరారు చేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పుడున్న సిట్టింగులకే మళ్లీ టిక్కెట్లు అని ప్రకటించారు. 108 నియోజకవర్గాల సమీక్షలు జరిపి చురుగ్గా పనిచేసేవారికి ఇంటర్నల్ గా టిక్కెట్ హామీ ఇస్తున్నారు. సాధారణంగా చంద్రబాబు టిక్కెట్ల విషయంలో చివరి వరకూ తేల్చరన్న అపవాదు ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో టీడీపీ నాయకుల్లో జోష్ నెలకొంది. ఇదంతా ముందస్తు ఎన్నికలకు సన్నాహాల్లో భాగమేనని తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. మరో వైపు యువనేత నారా లోకేష్ పాదయాత్రకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా జోరు మీద ఉన్నారు. ఏపీలో జనసేన గ్రాఫ్ పెరిగిందని సర్వేలు తేల్చిచెప్పడం, అందుకు తగ్గ నివేదికలు పవన్ కు చేరడంతో ఆయన బస్సు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. నియోజకవర్గాల సమీక్షలు జరుపుతున్నారు. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ గా ఉండాలని భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా 17 నెలల వ్యవధి ఉండగానే నాయకులు హడావుడి చేస్తుండడం వెనుక ‘ముందస్తు’ అనుమానాలే ప్రధాన కారణం.

అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాలో పనిచేసిన ఐవైఆర్ క్రిష్ణరావు చేసిన తాజా ట్విట్ ఏపీలో ముందస్తు ఎన్నికలు తప్పవని సంకేతాలిచ్చారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన ఆయన.. పదవీవిరమణ తరువాత కూడా సలహాదారుడిగా ప్రకటించారు. చంద్రబాబును విభేదించి గత ఎన్నికల్లో జగన్ కు అనుకూలంగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా ఉన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేయడానికి ఇబ్బంది పడుతోందని.. అందుకే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతోందని.. మూడు రాజధానుల విషయంలో వైసీపీ నేతలు స్పీడప్ చేయడానికి అదే కారణమంటూ ట్విట్ చేశారు. అయితే ఇది వైరల్ అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఐవైఆర్ కు ఎటువంటి సమచారం లేకుండా ఇటువంటి ట్విట్ చేయరని అన్ని పార్టీల నేతలు చెబుతున్నారు. అయితే దీనిని ధ్రువీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కామెంట్స్ చేశారు. ముందస్తు అర్ధం వచ్చేలా ఏదైనా సాధ్యమేనని చెప్పుకొచ్చారు. గతంలోకూడా సజ్జల ముందస్తు ఎన్నికలపై స్పష్టమైన ప్రకటన చేశారు. తరువాత దాని గురించి పట్టించుకోలేదు. ఈసారి ముక్తసరిగా మాట్లాడుతునే ముందస్తు ఎన్నికలు ఉంటాయని సంకేతాలిచ్చారు.