Amaravati Drone Summit 2024: అమరావతిలో డ్రోన్ షో సూపర్ హిట్.. 5 రికార్డులు.. డ్రోన్ షోతో చంద్రబాబు సాధించిన లక్ష్యాలేమిటి?

అమరావతి అదరగొట్టింది. దీపావళికి ముందే సరికొత్త వెలుగులు విర జమ్మింది. నక్షత్రాలు కూడా భ్రమపడేలా కాంతులు వెదజల్లింది. మొత్తంగా సరికొత్త ప్రపంచ రికార్డులను సృష్టించింది. ఏకంగా ఐదు విభాగాలలో గిన్నిస్ ఘనతలను సొంతం చేసుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 23, 2024 12:19 pm

Amaravati Drone Summit 2024(1)

Follow us on

Amaravati Drone Summit 2024: మంగళవారం రాత్రి కృష్ణానది తీరంలో ఏర్పాటుచేసిన డ్రోన్ షో ప్రజలను పులకితులను చేసింది. ప్రజల రాకతో పున్నమి ఘాట్ కిక్కిరిసిపోయింది. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మొదలైన డ్రోన్ షో అభ్యంతం కనులవిందు కలిగించింది. ఒక్కసారిగా 5,500 డ్రోన్లు రయ్ మంటూ ఆకాశం పైకి లేచాయి. ఆ తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆధారంగా డ్రోన్లు పైకి లేచాయి. అద్భుతమైన ప్రదర్శన చేశాయి.. ఏవియేషన్ రంగంలో అద్భుతాలను పరిచయం చేస్తూ డ్రోన్ షో మొదలైంది. పౌర విమానయాన రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రైట్ బ్రదర్స్ కు నివాళిగా.. ఆయన రూపొందించిన తొలి విమానం తో కూడిన తొలి పౌర విమానయాన పోస్టల్ స్టాంప్ ను ప్రదర్శించింది.. ఆ తర్వాత అతిపెద్ద బోయింగ్ విమానాన్ని డిస్ ప్లే చేసింది. ఇక మూడవది అమరావతి డ్రోన్.. దీనిని చారిత్రాత్మకమైన ఘట్టంగా అభివర్ణిస్తూ ప్రదర్శించింది. భవిష్యత్తు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రదర్శించింది. అమరావతి ఐతిహ్యాన్ని ప్రదర్శిస్తూ రూపొందించిన బుద్ధుడి చిత్రం సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించింది.

డ్రోన్ షో కు ముందు..

డ్రోన్ షో కు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.. ఒక వేదికపై స్థానిక కళాకారులు.. మరో వేదికపై భోగిరెడ్డి శ్రావ్య మానస ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. అనంతరం హైదరాబాద్ నగరానికి చెందిన త్రియోరి ఆక్రో బాట్ బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శన, విన్యాసాలు ఆకట్టుకున్నాయి.. ఆ తర్వాత ఆధునిక, సంప్రదాయ సంగీత పరికరాలతో నిర్వహించిన కచేరి ఆకట్టుకున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కచేరిని చూసి మంత్రముగ్ధులయ్యారు. డ్రోన్ షో అనంతరం లేజర్ బీమ్ షో నిర్వహించారు. అనంతరం భారీగా బాణసంచా కాల్చారు.

ఆకట్టుకున్న హ్యాకథాన్

వివిధ రంగాల అవసరాలు తీర్చుతున్న డ్రోన్లపై హ్యాకథాన్ నిర్వహించారు. అడవుల దహనాన్ని నిరోధించడం, అనధికారిక కట్టడాల గుర్తింపు, గ్యాస్ పైప్ లైన్ల పరిశీలన, పబ్లిక్ సేఫ్టీ, హెల్త్, మెడికల్ సప్లై, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, అభివృద్ధి పనుల సమీక్ష వంటి వాటిపై డ్రోన్ హ్యాక థాన్ నిర్వహించారు. దీనికి 500 మంది తమ కాన్సెప్ట్ తో పోటీపడ్డారు. ఇందులో విజేతకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహుమతులు అందించారు. ఆ తర్వాత గిన్నిస్ సంస్థ ప్రతినిధులు 5 అవార్డులను ముఖ్యమంత్రి కి అందించారు..

గిన్నిస్ రికార్డులు

కృష్ణానది తీరంలో జరిగిన డ్రోన్ షో సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించింది. లార్జెస్ట్ ప్లానెట్ డ్రోన్ షో గా అవతరించింది. భారత దేశంలో ఏ దేశం రంగం ఎలా వెలిగిపోతుందో చెప్పింది. ఈ షో అతిపెద్ద ల్యాండ్ మార్క్ ప్రదేశంలో నిర్వహించిన నేపథ్యంలో గిన్నిస్ రికార్డులు ఏపీ ప్రభుత్వం సొంతమయ్యాయి. అత్యంత పెద్ద బోయింగ్ విమానాన్ని త్రీడీ టెక్నాలజీ ద్వారా చూపించినందుకు.. డ్రోన్స్ ద్వారా అతిపెద్ద ఇండియన్ ఫ్లాగ్ ను ఆవిష్కరించినందుకు.. అతిపెద్ద ఏరియల్ లోగోను రూపొందించినందుకు.. బాట్ లాబ్ టీమ్ కు గిన్నిస్ అవార్డులు లభించాయి.