Chandrababu Strategy: సుదీర్ఘకాలం రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ), చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆ వైరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డితో కొనసాగించారు చంద్రబాబు. అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు జగన్మోహన్ రెడ్డి. 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తనను జైలు పాలు చేశారని అనుమానించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరదించాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే వై నాట్ కుప్పం అన్న నినాదాన్ని బలంగా వినిపించారు. పులివెందుల లో స్థానిక సంస్థల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేలా పావులు కదిపారు. అందులో సక్సెస్ కావడంతో 2024 ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తానని శపధం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. అయితే తన రాజకీయ జీవితాన్ని ముగించాలనుకున్న జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ తీయాలని చంద్రబాబు భావించారు. అందుకు పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికను పావుగా వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని సొంత గెడ్డలో డిపాజిట్ రాకుండా చేయడంలో విజయం సాధించారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి పై స్పష్టమైన ప్రతీకారాన్ని తీర్చుకున్నారు.
Also Read: ఐదు దశాబ్దాల వైఎస్ కుటుంబ హవాకు చెక్!
కుప్పంలో గెలవడంతో..
2021లో స్థానిక సంస్థల ఎన్నికలు( local body elections) వచ్చాయి. తనకున్న వాలంటరీ వ్యవస్థతో స్థానిక సంస్థల్లో పట్టు బిగించారు జగన్మోహన్ రెడ్డి. కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైసిపి మద్దతుదారులను గెలిపించి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. తరువాత మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని గెలిచి గట్టి సవాల్ విసిరారు. అప్పటినుంచి వై నాట్ కుప్పం అంటూ నినాదాన్ని ప్రారంభించి ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. అప్పటినుంచి ఆ నియోజకవర్గంలో చంద్రబాబును అడుగుపెట్టనీయకుండా చాలా రకాల ప్రయత్నాలు చేశారు. చాలా రకాలుగా అవమానాలు కూడా చేశారు. కానీ చంద్రబాబు పట్టు వదలని విక్రమార్కుడిలా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేశారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగారు.
Also Read: పులివెందులలో వైసిపి గల్లంతు.. ఇక కష్టమే!
నేరుగా కంచుకోటపై గురి..
ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబుది( CM Chandrababu) చిత్తూరు నియోజకవర్గమే. ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరి కాగా.. 1989 నుంచి కుప్పంలోనే ఆయన పోటీ చేస్తున్నారు. కానీ ఎప్పుడు చిత్తూరు జిల్లాను తన కంచుకోటగా మార్చుకోలేకపోయారు. కానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం పులివెందులలో పట్టు సాధించారు. కడప జిల్లాను తన కంచుకోటగా మార్చుకున్నారు. అయితే తండ్రి మాదిరిగా ఆ కంచుకోట ను కొనసాగించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల అడ్డాలో అద్భుత విజయాన్ని సాధించి చంద్రబాబు తన పాత పగ, ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. ముమ్మాటికి ఇది జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ ఫ్యామిలీకి ఇబ్బందికరమే. తప్పకుండా ఇదే స్ఫూర్తితో పనిచేసి 2029 ఎన్నికల్లో పులివెందుల ను కైవసం చేసుకునే ప్లాన్ చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి దీనిని ఎలా అధిగమిస్తారో చూడాలి.