Posani : ఏపీలో సినిమాలను అడ్డుకోవద్దు.. కేసీఆర్ పై పోసాని సంచలన వ్యాఖ్యలు

అంతటితో ఆగకుండా ఈ రోజు కేసీఆర్, తరువాత ఆయన కుమారుడు కేటీఆర్, అటు తరువాత రేవంత్ రెడ్డిలు సీఎంగా ఉంటారని అనవసర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే వైరల్ గా మారుతున్నాయి.

Written By: Dharma, Updated On : July 5, 2023 2:41 pm
Follow us on

Posani : పోసాని కృష్ణమురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రభుత్వంపై ఓ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సినిమాల చిత్రీకరణ విషయంలో కేసీఆర్ పునరాలోచించుకోవాలని కోరారు. ఎటువంటి అభ్యంతరాలు, అడ్డగింతలకు దిగవద్దని విన్నవించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఏపీలో సినిమాల చిత్రీకరణ పెద్దగా జరగడం లేదు. విశాఖ అనుకూలంగా ఉన్నా అనుకున్న స్థాయిలో షూటింగులు జరగడం లేదు. ఏపీ ప్రభుత్వం నుంచి ఆశించినంత సహకారం లేదని.. రాయితీలు, ఇతరత్రా విషయాల్లో జగన్ సర్కారు చొరవ చూపడం లేదన్న అపవాదు ఒకటి ఉంది. దాని మూలంగానే సినీ పరిశ్రమ సైతం ఏపీ వచ్చేందుకు ఇష్టపడడం లేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పోసాని కృష్ణమురళీ స్పందించారు. ఏకంగా ప్రత్యేకంగా విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

ఏపీలో సినిమా షూటింగులు జరిగితే తెలంగాణ సర్కారు ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని పోసాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేసీఆర్ కాళ్లు పట్టుకొని ఒప్పిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఈ రోజు కేసీఆర్, తరువాత ఆయన కుమారుడు కేటీఆర్, అటు తరువాత రేవంత్ రెడ్డిలు సీఎంగా ఉంటారని అనవసర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే వైరల్ గా మారుతున్నాయి. కేవలం ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నంది అవార్డుల కోసం పోసాని మాట్లాడారు. గతంలో నంది అవార్డులపై తాను చాలాసార్లు విమర్శలు చేశానన్నారు. వంద సినిమాలకు మాటలు రాస్తే.. తనకు ఒకసారి కూడా నంది అవార్డు రాలేదన్నారు. సూపర్ హిట్ సినిమాలు ఉన్నా పరిగణలోకి తీసుకోలేదన్నారు. అందుకే అప్పట్లో నంది అవార్డులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానని గుర్తుచేశారు. నాడు నంది అవార్డులపై విమర్శలు చేసినందున.. నీకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నానని.. మరోసారి అటువంటి తప్పిదాలు లేకుండా చూడాలని జగన్ నాకు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. పద్య నాటకాలు, నాటికలకు కూడా నంది అవార్డులు అందించనున్నట్టు పోసాని వివరించారు.