YCP: ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని జగన్.. ఎలాగైనా జగన్ ను అధికారం నుంచి దూరం చేయాలని చంద్రబాబు, పవన్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలోకి అడుగుపెట్టారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రజాగళం పేరిట రోజుకు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నెల 30 నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. అయితే ఈసారి జగన్ ఒక్కరే ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా కనిపిస్తున్నారు. వైసీపీతో పోల్చుకుంటే టిడిపి, జనసేనకు స్టార్ క్యాంపైనర్లు ఎక్కువగా ఉన్నారు. కుటుంబ సభ్యులు సైతం రంగంలోకి దిగుతున్నారు. కానీ వైసీపీకి మాత్రం జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీకి చాలామంది మద్దతుగా ప్రచారం చేశారు. చంద్రబాబు పై ఉన్న కోపంతో మోహన్ బాబు, టిడిపి టికెట్ ఇవ్వలేదన్న ఆగ్రహంతో అలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, పోసాని కృష్ణ మురళి, విజయ్ చందర్, భానుచందర్.. మరోవైపు రోజా.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంది.కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీకి అనుకూలంగా లేరు. మోహన్ బాబు ఇప్పటికే దూరమయ్యారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పార్టీకి దూరమయ్యారు. జనసేనలో చేరిపోయారు. అలీ ఆశించినట్టు నామినేటెడ్ పదవి దక్కలేదు. ఈ ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వలేదు. పోసాని కృష్ణ మురళి యాక్టివ్ గా ఉన్నా ఆయన ప్రజల్లో తిరిగేందుకు మొగ్గు చూపడం లేదు.విజయ్ చందర్, భానుచందర్ జాడలేదు. దీంతో వైసిపి ప్రచారానికి స్టార్ల కళ లేకుండా పోయింది.
తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు స్టార్ల మద్దతు లభిస్తుంది. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. సినీ పరిశ్రమ నుంచి సైతం చాలామంది మద్దతు తెలుపుతున్నారు. మురళీమోహన్, అశ్వినీ దత్, రాఘవేంద్రరావు, నారా రోహిత్ వంటి వారు మద్దతు తెలుపుతున్నారు. ఇక పవన్ జనసేన గురించి చెప్పనవసరం లేదు. మెగా బ్రదర్ నాగబాబు తో పాటు మెగా కాంపౌండ్ వాల్ నుంచి పుష్కలంగా మద్దతు ఉంది. బుల్లితెర నటులు సైతం జనసేనకు మద్దతుగా నిలుస్తుంటారు. ప్రచారానికి సైతం ముందుకు వస్తున్నారు. టిడిపి తో పాటు జనసేనకు అధినేతల కుటుంబాల నుంచి మద్దతు ఉంది. వైసీపీ విషయంలో మాత్రం జగన్కు సోదరి షర్మిల వ్యతిరేకంగా మారారు. బస్సు యాత్రను ప్రారంభించే సమయంలో తల్లి విజయమ్మ వచ్చి ఆశీర్వదించడం ఉపశమనం కలిగించే విషయం. అయితే గత ఎన్నికల మాదిరిగా ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు రాకపోవడం లోటే.