Tammineni Sitaram : స్పీకర్ తమ్మినేని సీతారాం డిగ్రీ సర్టిఫికెట్ అంశం మరోసారి బయటకు వచ్చింది. ఆముదాలవలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తన అఫీడవిట్ ను సమర్పించారు. అందులో తన విద్యార్హతలను ప్రస్తావించారు. తనది డిగ్రీ డిస్కంటిన్యూగా పేర్కొన్నారు. దీంతో డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించి లా అడ్మిషన్ ఎలా చేసుకున్నారన్నది ఇప్పుడు ప్రశ్న. గత కొద్ది రోజులుగా తమ్మినేని డిగ్రీ సర్టిఫికెట్ అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో ఓలా కాలేజీలో అడ్మిషన్ పొందారు ఆయన. ఇందుకోసం డిగ్రీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయితే ఆయన ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చారన్న విషయం టిడిపి బయట పెట్టింది. కానీ మరుగున పడిపోయింది. ఇప్పుడు మరోసారి బయటకు వచ్చింది.
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున తమ్మినేని గెలిచారు. అసెంబ్లీ స్పీకర్ గా ఎంపికయ్యారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా రాజకీయాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పొలిటికల్ కామెంట్స్ తో తన పదవిని గడిపేశారు. ఈ క్రమంలో ఆయన అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారు. తాను వైసీపీ ఎమ్మెల్యేను అని.. తరువాతే స్పీకర్ అని తేల్చి చెప్పారు. దీంతో రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఓ లా కాలేజీలో తమ్మినేని అడ్మిషన్ పొందారు. అది డిగ్రీ తర్వాత చేసే కోర్స్. ఈ క్రమంలో దూర విద్య ద్వారా డిగ్రీ చేసినట్లు చూపారు. కానీ సంబంధిత డిగ్రీ సర్టిఫికెట్ జారీ చేసిన సంస్థ.. తాము జారీ చేయలేదని స్పష్టం చేసింది. దీంతో ఇది ఫేక్ గా తేలింది.
అయితే తమ్మినేని ఫేక్ సర్టిఫికెట్లపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులు చేసింది. కానీ తెలంగాణలో కెసిఆర్ రూపంలో అనుకూల సర్కారు ఉండడంతో దీనిపై ఎటువంటి విచారణ జరగలేదు. ఈ అంశం మరుగున పడింది. తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా ఆమదాలవలస వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్మినేని.. తన విద్యార్హతను డిగ్రీ డిస్కంటిన్యూగా చూపారు. దీంతో ఈ అంశం మరోసారి బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది టిడిపికి ప్రచార అస్త్రం గా మారనుంది. ఒక రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న తమ్మినేని ఈ విధంగా వ్యవహరించడాన్ని తెలుగుదేశం పార్టీ హైలెట్ చేసే అవకాశం కనిపిస్తోంది.