https://oktelugu.com/

Aviation : విమానయానం జోరు.. ఒక్కరోజే 5 లక్షల మంది ప్రయాణం!

ఇక భారత విమానయాన సంస్థ గతంలో ఎన్నడూ లేనంతంగా వృద్ధి నమోదు చేస్తోంది. ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, అందుబాటు ధరల్లో విమాన సేవలు అందించే సంస్థల విస్తరణ కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. ‘రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. మున్ముందు ఈ జోరు కొనసాగాలని ఆశిస్తున్నాం’ అని విమానయాన మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పోస్టు చేసింది.

Written By: NARESH, Updated On : April 23, 2024 12:12 pm
air passengers

air passengers

Follow us on

Aviation : దేశంలో విమానయానం ఊపందుకుంటోంది. ఇన్నాళ్లు బస్సులు, రైళ్లు మాత్రమే కిక్కిరిసి కనిపించేవి. ఇప్పుడు విమానాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. దీంతో విమాన ప్రయాణాల్లో భారతీయులు గత రికార్డులను తిరగరాస్తున్నారు. తాజాగా ఆదివారం భారత్‌ విమానయాణంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజే 5 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు.

దేశీయంగానే 4.71 లక్షల మంది..
దేశవ్యాప్తంగా ఆదివారం వివిధ ప్రాంతాల మధ్య 6,128 విమాన సర్వీసులు నడిచాయి. వీటిలో ఏకంగా 4,71,751 మంది ప్రయాణించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనాకు ముందున్న ప్రయాణికులు రోజుకు సగటున 3,98,579 మంది ప్రయాణించేవారు. ఇప్పడు ఇది 14 శాతం అధికంగా నమోదైందని పేర్కొంది. ఇక గతేడాది ఏప్రిల్‌ 21న దేశీయంగా 5,899 విమాన సర్వీసుల్లో 4,28,389 మంది ప్రయాణించారు. ఈసారి మరో 40 వేల పైచిలుకు మంది ఎక్కువగా ప్రయాణించారు.

ఈ ఏడాది ప్రయాణించిన వారు..
ఇక ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు దేశీయ విమానయాన సంస్థల సర్వీసుల్లో ప్రయాణించిన వారు 391.46 లక్షలుగా ఉన్నట్లు భారత విమానయాన సంస్థ నియంత్రిత సంస్థ డీజీసీఏ తెలిపింది. గతేడాది ఈ సంఖ్య 375.04 లక్షలుగా ఉందని పేర్కొంది. ఈ ఏడాది వార్షిక వృద్ధి 4.38 శాతంగా నమోదైంది. ఇక నెలవారీ వృద్ధి రేటు 3.68 శాతంగా ఉందని డీజీసీఏ ప్రకటించింది.

భారీగా వృద్ధి..