Jagan political strength: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడింది. ఆ పార్టీ ఆవిర్భావమే ఒక్క చరిత్ర. తండ్రి అధికార వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంతో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి గురై జైలు పాలయ్యారు. ఒకవైపు తండ్రి అకాల మరణం, ఇంకోవైపు అక్రమ కేసులు పెట్టారని సానుభూతి.. ఈ రెండు అంశాలు పనిచేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అడ్డు, అదుపు లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చున్నా.. 67 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 2019లో కనివిని ఎరుగని విజయాన్ని నమోదు చేసుకున్నారు. అధికారం చేపట్టిన తర్వాత అన్ని రకాల ఎన్నికల్లో ఏకపక్ష విజయం సొంతం చేసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే జగన్ సోలో పెర్ఫార్మెన్స్ అని కార్యకర్తలు సగర్వంగా చెప్పుకునేలా నిలబెట్టారు. కానీ ఒకే ఒక్క ఓటమి అభిప్రాయాన్ని తారుమారు చేసింది. అయితే ఈ ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డిలో భయం ప్రారంభం అయింది. అది అనేక రూపాల్లో బయటపడింది.
భయం ప్రారంభం..
2014, 2019 ఎన్నికల్లో ప్రత్యర్థి విషయంలో అస్సలు ఆలోచన చేయలేదు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). ఎంతమంది కలిసి వచ్చినా భయపడలేదు. కానీ గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో ఏ పార్టీ కూడా కలవకూడదని అనేక రకాల ప్రయత్నాలు చేశారు. బిజెపిని చాలా వరకు నియంత్రించారు. జనసేన టిడిపి తో కలవకుండా ఉండేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అవేవీ ఫలించలేదు. మూడు పార్టీలు కలిసాయి. ఘన విజయం సొంతం చేసుకున్నాయి. అయితే ఇదివరకు ఎన్నడూ లేని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి. తన బలం కంటే.. ప్రత్యర్థిని బలహీనం చేసే అంశాలను నమ్ముకోవడం విశేషం.
ఎటుపోయింది జనాకర్షణ..
చరిష్మ ఉన్న నేతగా జగన్మోహన్ రెడ్డిని సొంత పార్టీ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటాయి. ఆయన తిరుగులేని జనాకర్షణ నేతగా అనుకూల విశ్లేషకులు విశ్లేషిస్తుంటారు. కానీ అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇతర అంశాలపై ఆధారపడుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. సినీ సెలబ్రిటీలకు మించి తనకు జనాకర్షణ ఉందని జగన్మోహన్ రెడ్డి తన హావభావాల ద్వారా సంకేతాలు ఇస్తుంటారు. మరి అటువంటి అప్పుడు అల్లు అర్జున్ వివాదాన్ని తనకు ఎందుకు అనుకూలంగా మార్చుకున్నట్టు? అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదల సమయంలో కటౌట్లు ఎందుకు? ఆ ఫ్లెక్సీలు ఎందుకు? పుష్ప సినిమా విడుదల సమయంలో తొక్కిసలాట జరిగింది. అందుకు బాధ్యులుగా చేస్తూ అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి కంటే.. అల్లు అర్జున్ కోసం జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా పరితపించారు. దాని వెనుక ఉన్న కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ ను తన వైపు తిప్పుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక. అయితే అప్పుడే జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపించింది. సోనియా గాంధీ లాంటి పెద్ద నేతను ఢీకొట్టారు అని గొప్పగా చెప్పుకునే వైసిపి శ్రేణులు.. మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ లాంటి హీరో మద్దతు కోసం పరితపించడం ఏంటనేది వైసీపీ సీనియర్ల బాధ.
వైసీపీలో మెగా జపం..
ఇప్పుడు చిరంజీవి ఎపిసోడ్ ని తీసుకుందాం. బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడే సరికి చిరంజీవి ప్రకటన విడుదల చేశారు. అప్పట్లో తాను కోరడం వల్లే టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇచ్చారని చెబుతున్నారు. కానీ 2024 ఎన్నికలకు ముందు.. ఎన్నికల ప్రచారంలో తన అన్నను అవమానించారని పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సమయంలో చిరంజీవి ఎందుకు స్పందించలేదు. ఇప్పుడు స్పందించారు అనగానే వైసిపి ఎందుకు సంబరపడినట్టు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మెగా జపం ఎందుకు చేస్తున్నట్టు? ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కారణం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒంటరి చేయడం.. ఆ కుటుంబంలో చిన్నపాటి భేదాభిప్రాయాలు వచ్చి రాజకీయంగా వాడుకోవాలని చూడడం కనిపిస్తోంది. కానీ ఎక్కడ జగన్.. ఎంతకీ దిగజారి పోయారు? అనేది ఇప్పుడు విశ్లేషణ ముఖ్యం. ఇండియన్ పొలిటికల్ హిస్టరీని చెక్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్ధుల బలహీనతలపై ఆధారపడడం మాత్రం విచారకరం. అది ఎంత మాత్రం మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.