Shock to Vidudala Rajini: ఏపీలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి 11 స్థానాలకు పరిమితమైంది. చివరకు ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మళ్లీ ప్రజల్లో నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రకరకాల కార్యక్రమాలు చేపడుతోంది.
కూటమి ప్రభుత్వంపై ఉద్యమం చేయడానికి వైసిపి ఏకంగా డిజిటల్ బుక్ ను తెరపైకి తీసుకువచ్చింది. కూటమి నేతల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వైసీపీ కార్యకర్తలు ఈ యాప్ లో నమోదు చేయాలని వైసిపి అధినేత జగన్ ఆదేశించారు. లోకేష్ రెడ్ బుక్ తీసుకొని వస్తే.. జగన్ డిజిటల్ బుక్ ను అందుబాటులో తీసుకొచ్చారు. వాస్తవానికి డిజిటల్ బుక్ లో కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదులు నమోదు కావాల్సి ఉంటే.. కానీ అందుకు విచిత్రంగా వైసిపి నేతలపైనే ఫిర్యాదులు వస్తున్నాయి.
చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజిని పై వైసీపీ రూపొందించిన డిజిటల్ బుక్ లో ఫిర్యాదు నమోదయింది. విడుదల రజనీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యాదు చేయడం సంచలనం వేపుతోంది. 2022లో చిలకలూరిపేటలో నవతరం పార్టీ కార్యాలయం పై విడుదల రజిని ఆధ్వర్యంలో దాడులు జరిగాయని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. తన కారుపై మాజీ మంత్రి దాడి చేయించారని.. ఇంట్లో వస్తువులను కూడా ధ్వంసం చేయించారని సుబ్రహ్మణ్యం ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అకారణంగా ఇబ్బంది పెట్టిన రజినిపై చర్యలు తీసుకోవాలని జగన్ కు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని ఆయన మీడియా కూడా వెల్లడించారు. డిజిటల్ బుక్ ద్వారా వచ్చిన ఫిర్యాదు టికెట్ ను కూడా ఆయన మీడియాకు చూపించారు. తాను చేసిన ఫిర్యాదు ఆధారంగా వైసీపీ అధినేత జగన్ చర్యలు తీసుకుంటే కచ్చితంగా కార్యకర్తలకు కూడా నమ్మకం ఉంటుందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేసే దానికంటే ముందే చిలకలూరిపేటలో రజిని ఈ యాప్ ను ఆవిష్కరించడం విశేషం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రజనీపై కేసు నమోదయింది. ఆమె మరిది జైలుకు వెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన కేసులో రజనీపై ఫిర్యాదు కూడా నమోదయింది. ఆమె వ్యక్తిగత సహాయకుడిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అప్పటినుంచి రజిని అరెస్టు అవుతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మాత్రం కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని ఆరోపిస్తున్నారు.