Bird Flu: ఏపీని బర్డ్ ఫ్లూ( bird flue ) వణికిస్తోంది. వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అదే సమయంలో మనుషులకు సైతం ఈ వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అధికారులు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా ఉంగటూరు మండలంలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. కోళ్ల ఫారం సమీపంలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించగా.. అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. రిపోర్టులో అతడికి బర్డ్ ఫ్లూ ఉన్నట్లు తేలింది. దీంతో అధికారుల సైతం అలెర్ట్ అయ్యారు.
* మరో కొత్త కలకలం
మరోవైపు తూర్పుగోదావరి( East Godavari ) జిల్లాలో ఆందోళన కలిగించే మరో విషయం వెలుగులోకి వచ్చింది. చేపల చెరువులకు బర్డ్ ఫ్లూ కోళ్లను మేతగా వేస్తున్నారు. చనిపోయిన కోళ్లను చెరువుల్లో పడేస్తున్నారు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలో చాపలకు మేతగా కోళ్లను వేస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలను కాకినాడలోని ఎన్జీవో ప్రతినిధులు విడుదల చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* ప్రభుత్వం అప్రమత్తం
గోదావరి జిల్లాలతో( Godavari district) పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సైతం లక్షలాది కోళ్లు, పక్షులు మృత్యువాత పడుతున్నాయి. దీనికి కారణమైన బర్డ్ ఫ్లూ వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే సంబంధిత మంత్రులు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 350 కోళ్ల ఫామ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో రోజుకు సుమారు 24 మిలియన్ గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు వాటిని ఎగుమతి చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావంతో ఎగుమతులు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. దీంతో కోళ్ల పెంపకం దారులకు నష్టాలు తప్పేలా లేవు.
* అధికారుల ఆంక్షలు
అయితే కోళ్ల ఫారాలు( poultry farms ) చనిపోతున్న కోళ్లను చేపల మేతకు వేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అటువంటి ప్రాంతాలపై పూర్తిగా నిఘా వేశారు. ప్రభావిత గ్రామాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. కోళ్లు, పౌల్ట్రీ ఉత్పత్తుల తరలింపు పై నిఘా పెట్టారు. పోలీస్, రెవెన్యూ, అటవీ, పశుసంవర్ధక శాఖల అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి రాపిడ్ రెస్పాన్స్ టీంలను నియమించారు.