Yarada Beach: ఎన్నెన్నో అందాల సమాహారం విశాఖ నగరం. సాగర నగర హోయలతో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది విశాఖ. ఒకవైపు తీర అందాలు.. రాళ్ల నడుమ అలల సందడి.. మరోవైపు తివాచీ పరిచినట్టు పచ్చదనం.. చుట్టూ ఎతైన కొండలు.. మానసిక ప్రశాంతతను ఇచ్చే అందాలు విశాఖ నగరం సొంతం. అందుకే పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఫోటోషూట్లకు అయినా.. ఫ్రీ వెడ్డింగ్ వేడుకలకైనా.. ఇలా ఒకటేమిటి అన్ని వేడుకలకు అనువైన ప్రాంతంగా తెలుగు రాష్ట్రాల్లో విశాఖ నిలుస్తోంది. అయితే విశాఖలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పర్యటకులకు సుపరిచితం.
విశాఖ వెళ్లే వారికి ముందుగా గుర్తొచ్చేది రామకృష్ణ బీచ్ మాత్రమే. నగరానికి అందుబాటులో ఉండడంతో తీరంలో సేద తీరాలనుకునేవారు ఇట్టే చేరిపోతారు. ఇంకాస్త గడపాలనుకున్నవారు రిషికొండ, భీమిలి బీచ్లను చూసొస్తారు. కానీ మనసును ఆహ్లాదపరిచే చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందులో యారాడ బీచ్ ప్రధానమైనది. ఇక్కడికి చేరుకోవాలంటే కొండల నడుము ప్రయాణించాలి. అయితే ఈ ప్రయాణం సైతం ఆహ్లాద పరుస్తుంది. కొండపై నుంచి విశాఖ నగరం, సముద్ర అలలు, విశాఖలో పేరు మోసిన ప్రాంతాలు ఇట్టే కనిపిస్తాయి.
యారాడ బీచ్ లో అడుగుపెడితే ఎన్నెన్నో ప్రత్యేకతలు దర్శనమిస్తాయి. డాల్ఫిన్స్ నోస్ కొండలకు ఆనుకొని ఈ ప్రాంతం చూడముచ్చటగా ఉంటుంది. ఎత్తయిన కొండల అంచున ఒదిగిపోయాలా ఉండే ఈ ప్రాంతం ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది. కొండలపై సహజ సిద్ధంగా ఏర్పడే నాచు, తీరానికి ఆనుకుని ఉన్న కొబ్బరి చెట్లు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. భారీ కొండలు కాలక్రమంలో అలలకు కోతకు గురై వివిధ ఆకృతులలో ఏర్పడ్డాయి. వాటిని చూస్తే ఏదైనా ద్వీపంలో ఉన్నామా అని అనిపిస్తుంది.
పర్యాటకులకు ఆకట్టుకునే విధంగా ఏరా బీచ్ ఉంటుంది. ప్రైవేట్ రిసార్ట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఫోటోషూట్లకు అనువైన చిన్నపాటి సెట్టింగులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. పల్లె వాతావరణం, దేవాలయం, పూరిల్లు, మంచె, మర బోటు లాంటి అవుట్ డోర్ షూటింగు నకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అక్కడ కనిపించడం విశేషం. ముఖ్యంగా షార్ట్ ఫిల్ములు చేయాలనుకునే వారికి స్వర్గధామం. ఇటీవల వెడ్డింగ్ షూట్లు సైతం పెరగడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిస్సా, చత్తీస్గడ్ల నుంచి పర్యటకులు వస్తుంటారు. వారాంతపు రోజున, ప్రత్యేక పర్వదినాల్లో పర్యాటకుల తాకిడి అధికం. ఒక్క మాటలో చెప్పాలంటే విశాఖ నగరం ఎన్నెన్నో అందాలకు నెలవు. మరి ఎందుకు ఆలస్యం కార్తీక వన సమారాధన విశాఖలోనే జరుపుకుందాం.