Jagan Flight: జగన్ ప్రయాణించే విమాన ఖర్చు ఎంతో తెలుసా?

మరోవైపు సీఎం జగన్ కు రక్షణగా నలుగురు అధికారులు ఇప్పటికే లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. వారికి విమాన టిక్కెట్లు, వసతి, ఇతరత్రా ఖర్చులు కలిపి కోటిన్నర కు పైగా ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : May 18, 2024 1:37 pm

Jagan Flight

Follow us on

Jagan Flight: సీఎం జగన్ తరచూ తాను పేద వాడినని చెబుతుంటారు. పెత్తందారులతో పోరాడుతున్నానని పదేపదే మాట్లాడుతుంటారు. కనీసం తన వద్ద ఫోన్ కూడా లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే జగన్ పేదతనంపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. పెత్తందారు నేలపైన, పేదవాడు విమానాల్లో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో.. సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సమేతంగా యూరప్ లో పర్యటించనున్నారు. దాదాపు రెండు వారాలపాటు వేసవి విడిది చేయనున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని చెబుతున్నా.. ఈ రాష్ట్రానికి సీఎంగా ఆయన రక్షణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఇది విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.

నిన్న విదేశీ పర్యటనకు జగన్ కుటుంబ సమేతంగా బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన తిరిగి జూన్ 1 రాష్ట్రానికి రానున్నారు. అయితే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన విమాన ఖర్చు వివరాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్దియర్ 7500 అనే విలాసవంతమైన ప్రత్యేక విమానంలో ఆయన పర్యటనకు వెళ్లారు. దాని ఖర్చు గంటకు అక్షరాలా 12 లక్షల రూపాయలు. ఒకరోజు ముందుగానే ఆ విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. గంటకు 12 లక్షల రూపాయలు ఖర్చు చేసే జగన్ పేదవాడా? పెత్తందారా? అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు సీఎం జగన్ కు రక్షణగా నలుగురు అధికారులు ఇప్పటికే లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. వారికి విమాన టిక్కెట్లు, వసతి, ఇతరత్రా ఖర్చులు కలిపి కోటిన్నర కు పైగా ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన అయినా.. ఆయన కుటుంబం వరకు ఆయనే భరించినా.. భద్రతా సిబ్బంది ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఎన్నికల్లో తాను పేదనని చెప్పుకునే జగన్.. విమానానికే గంటకు 12 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చేజేతులా ఆయన విపక్షాలకు విమర్శనాస్త్రాలు అందించినట్లు అవుతోంది.