Godavari Express: ఉత్తరాంధ్ర ప్రజలు భాగ్యనగరం రావాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు.. గోదావరి ఎక్స్ ప్రెస్. సమయపాలన, భద్రతకు ఈ రైలు పెట్టింది పేరు. అందుకే ఈ రైలులో ప్రయాణానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. రాజధానికి వెళ్లేందుకు అనువైన రైలు కూడా ఇది. పైగా ఈ రైలులో ప్రయాణిస్తే అనుకున్న పనులు అవుతాయని ఒక నమ్మకం. అందుకే ఈ రైలు ప్రయాణానికి ఎక్కువమంది ఇష్టపడతారు. 90వ దశకములో అయితే ప్రజా ప్రతినిధులు సైతం నిత్యం ఈ రైలు ద్వారా రాకపోకలు సాగించేవారు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య వారధిగా నిలుస్తోంది ఈ రైలు. బుల్లెట్ రైళ్ల వైపు కాలం పరుగులు పెడుతున్న సమయంలో.. 50 వసంతాలు పూర్తిచేసుకుంది గోదావరి ఎక్స్ ప్రెస్.
1974 ఫిబ్రవరి 1న స్టీమ్ ఇంజన్ తో మొట్టమొదటిసారి ఈ రైలు పట్టాలు ఎక్కింది. మొదటిసారి వాల్తేరు- హైదరాబాద్ మధ్య నడిచింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విశాఖ,హైదరాబాద్ డెక్కన్ మధ్య ఈ రైలు నడుస్తోంది. గోదావరి ఎక్స్ ప్రెస్ 50 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. గోదావరి ఎక్స్ ప్రెస్ వెళ్లే అన్ని ప్రధాన స్టేషన్లలో సంబరాలు జరుపుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ప్రస్తుతం ఈ రైలు 12727,12728 నంబర్లతో విశాఖ- సికింద్రాబాద్ మధ్య నడుస్తోంది. 1974 ఫిబ్రవరి ఒకటో తేదీన మొదటిసారిగా ప్రారంభించిన ఈ రైలు నెంబర్ 7007, సికింద్రాబాద్ వాల్తేరు మధ్య రైలు నెంబర్ 7008గా ప్రవేశపెట్టారు. మొత్తం 18 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. 710 కిలోమీటర్ల ప్రయాణ దూరం కాగా.. ప్రయాణ సమయం 12 గంటల 25 నిమిషాలు. 17 భోగిలతో ప్రయాణించే ఈ గోదావరి రైలు గంటకు 57 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గోదావరి రైలులో ప్రయాణం శుభం, శుభప్రదం, శ్రేయస్కరం అన్న సెంటిమెంట్ ను సొంతం చేసుకోవడం విశేషం.