https://oktelugu.com/

Jagan-DK: బెంగళూరులో జగన్ ను కలిసిన వార్తలపై డీకే సంచలన కామెంట్స్

Jagan-DK: ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 175 స్థానాలకు గాను వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 1, 2024 11:48 am
    DK Shivakumar fire on fake news about meet with Jagan

    DK Shivakumar fire on fake news about meet with Jagan

    Follow us on

    Jagan-DK: దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ చరిష్మ ఉన్న నాయకుడిగా మారారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేనున్నాను అంటూ ముందుకొచ్చి సమస్యకు పరిష్కార మార్గం చూపేది ఆయనే. ఆ మధ్యన షర్మిల తెలంగాణ వైయస్సార్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. పార్టీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో డీకే శివకుమార్ ను కలిశారు. తరువాత పార్టీని విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. డీకే శివకుమార్ చక్రం తిప్పడం వల్లే షర్మిల పిసిసి అధ్యక్షురాలయ్యారని ఒక ప్రచారం జరిగింది.

    ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 175 స్థానాలకు గాను వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఏపీలో వ్యతిరేక ప్రభుత్వం రావడం, తెలంగాణలో చంద్రబాబుకు సన్నిహితుడైన రేవంత్ రెడ్డి సీఎం గా ఉండడంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఉండడం కంటే బెంగళూరు వెళ్ళిపోవడమే శ్రేయస్కరమని జగన్ భావించినట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే బెంగళూరులోని తన సొంత ప్యాలెస్ యలహంకలో కొద్దిరోజులపాటు ఉండిపోయారు.ఈ నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో జగన్ ప్రత్యేక చర్చలు జరిపినట్లు జోరుగా ప్రచారం సాగింది.

    కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేస్తారని టాక్ ప్రారంభమైంది.డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో జగన్ మాట్లాడుతున్నారని కూడా టాక్ నడిచింది.వాస్తవానికి డీకే శివకుమార్ వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు.ఆ నేపథ్యంలోనే అప్పట్లో షర్మిల కలిశారు.కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వగలిగారు.ఇప్పుడు జగన్ సైతం అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేస్తారని.. పీసీసీ పగ్గాల నుంచి షర్మిల తొలగిస్తే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని జగన్ చెప్పుకొచ్చినట్లు ప్రచారం సాగింది. ముఖ్యంగా ఏపీలోని ఎల్లో మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. డిబేట్లు కూడా కొనసాగాయి.

    అయితే రోజురోజుకు ప్రచారం పెరుగుతున్న నేపథ్యంలో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదన్నారు. ఎక్స్ ద్వారా స్పందించారు.’ జగన్ తో భేటీ అయినట్లు కొందరు నీచులు సృష్టించారు. ఈ వార్తలను ఎవరు నమ్మవద్దు. నేనెప్పుడూ జగన్ ను కలవలేదు’ అని పోస్ట్ చేశారు. ఇటీవలే స్పీకర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ మద్దతును బిజెపి కోరిన సంగతి తెలిసిందే. ఒకవైపు బిజెపితో స్నేహ హస్తం కొనసాగిస్తూనే.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. చంద్రబాబు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా మారిన నేపథ్యంలో.. జగన్ తన మనసును మార్చుకున్నారని ప్రచారం జరిగింది. డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడిచింది. వాటన్నింటికి చెక్ చెబుతూ డీకే శివకుమార్ ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం విశేషం.