AP Elections 2024: సామాన్యులే ఎదురు తిరిగారు.. ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు

పిఠాపురంలో పోలింగ్ బూత్ పరిశీలించేందుకు వైసీపీ అభ్యర్థి వంగా గీత వెళ్లారు. ఓ కేంద్రానికి వెళ్లే క్రమంలో అందరికీ నమస్కరిస్తూ ముందుకు సాగారు. అక్కడే ఉన్న వృద్ధుడు అది తప్పు అని చెప్పే ప్రయత్నం చేశాడు.

Written By: Dharma, Updated On : May 23, 2024 10:39 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: పల్నాడు, మాచర్ల అన్న ప్రాంతాలు సినిమాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందేవి. రాయలసీమ ఫ్యాక్షన్ తరహాలో.. పౌరుషానికి ప్రతీకగా చాలా సినిమాల్లో ఆ ప్రాంత ప్రత్యేకతను చూపేవారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ ప్రాంతాలు రక్తసిక్తమయ్యాయి. విధ్వంసకర ఘటనలకు కేంద్ర బిందువు అయ్యాయి. అయితే ఈ ఘటనలు అన్ని ఆధిపత్యం కోసమే అనలేము. రాష్ట్రస్థాయిలో రాజకీయాలను శాసించేందుకు.. ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసేందుకేనన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తరహా ఘటనలను సామాన్యులు అడ్డుకోవడం విశేషం.

అయితే ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యేలను నిలువరించేందుకు సామాన్యులు ప్రయత్నించడం ఆందోళన కలిగించింది. పోలింగ్ నాడు క్యూలో కాకుండా.. మరో మార్గంలో వెళ్లి ఓటు వేసేందుకు ప్రయత్నించిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను సామాన్య యువకుడు ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఆ యువకుడిపై చేయి చేసుకున్నాడు. కానీ ఆ యువకుడు వెనక్కి తగ్గలేదు. తిరిగి ఎమ్మెల్యే చెంపను చెల్లుమనిపించాడు. దీనిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. సదరు సిటింగ్ ఎమ్మెల్యేలను పోలింగ్ అయ్యేంతవరకు గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది.

పిఠాపురంలో పోలింగ్ బూత్ పరిశీలించేందుకు వైసీపీ అభ్యర్థి వంగా గీత వెళ్లారు. ఓ కేంద్రానికి వెళ్లే క్రమంలో అందరికీ నమస్కరిస్తూ ముందుకు సాగారు. అక్కడే ఉన్న వృద్ధుడు అది తప్పు అని చెప్పే ప్రయత్నం చేశాడు. క్యూలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేసే పనిగా చెప్పుకొచ్చాడు. దీంతో వంగా గీత నీళ్లు నమలాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పోలింగ్ బూత్ లో ఫోన్లో మాట్లాడారు. దీనిని అక్కడే ఉన్న ఓటర్లు తప్పుపట్టారు. నిబంధనలకు వ్యతిరేకమని తేల్చి చెప్పారు.

మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ కేంద్రంలో దూరి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న ఓ స్థానికుడు పిన్నెల్లి పై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన అనుచరుడికి దేహ శుద్ధి చేశారు. పిన్నెల్లి వైపు వెళ్లే క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. అటు పిన్నెల్లి కేంద్రం బయటకు రాగా ఓ మహిళ నిలదీసినంత పని చేసింది. గురజాలలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పై స్థానికులు తిరగబడ్డారు. వెంటబడి మరి తరిమేశారు. గన్నవరంలో వల్లభనేని వంశీ మోహన్ ను తరిమినంత పని చేశారు. అయితే ఎక్కడికక్కడే నేతలను సామాన్యులు నిలువరించడం విశేషం.