YCP MLAs Disqualification: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) ఎమ్మెల్యేలలో కొందరిపై అనర్హత వేటుపడటం ఖాయమని తెలుస్తోంది. అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో దీనిపై ఒక నిర్ధారణకు వచ్చారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండానే.. రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నట్లు ఈ కమిటీ దృష్టికి వచ్చింది. అటువంటి వారి వివరాలను ఈ కమిటీ పరిశీలించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో వారిపై వేటు వేసేందుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముందుగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. అటు తరువాత వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడు రోజుల కిందట మంత్రి నారా లోకేష్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సభకు హాజరు కాకుండానే కొంతమంది రిజిస్టర్లో సంతకాలు పెట్టి అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా ఎథిక్స్ కమిటీలో సైతం దానిపైనే చర్చ జరగడం విశేషం.
* ప్రతిపక్ష హోదాకు పట్టు..
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించింది. శాసనసభ నిబంధనల ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. అయితే సీట్లతో కాదు తమకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకొని.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) పట్టుపడుతున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం సభకు హాజరైతే బాగుంటుందని అభిప్రాయానికి వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వినడం లేదు. మరోవైపు కూటమి ప్రభుత్వం నుంచి అనర్హత వేటు మాట వినిపిస్తోంది. దీంతో కొత్తగా ఎన్నికైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అనర్హత వేటు పడుతుందని తెలిసి శాసనసభ రిజిస్టర్ లపై సంతకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
* ఎథిక్స్ కమిటీ సమావేశంలో నిర్ణయం..
అయితే తాజాగా ఎథిక్స్ కమిటీ ( ethics committee) సమావేశం అయింది. శాసనసభ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజర్ పై చర్చించింది. ఎవరెవరు సంతకాలు పెట్టి సభకు హాజరు కావడం లేదో గుర్తించింది. వారిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచి అలా సంతకాలు పెట్టి సభకు హాజరు కాకున్న ఎమ్మెల్యేల విషయంపై ప్రజల్లో బలమైన చర్చ జరిగేలా చూడాలని నిర్ణయించింది. తద్వారా వారిపై వేటు వేయడం తప్పు కాదు అని ప్రజలు అభిప్రాయపడేలా చేయాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయం.