Kadapa Mayor Suresh Babu: కడప కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబుపై( Kadapa Corporation mayor Suresh Babu ) అనర్హత వేటు పడింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలోనే సురేష్ బాబు పై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. కానీ ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మేయర్ పదవిని మళ్లీ పొందారు. అయితే ఇప్పుడు తాజాగా పురపాలక శాఖ మరో ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన పదవి నుంచి తప్పుకోలేని అనివార్య పరిస్థితి ఎదురయింది. కేవలం సురేష్ బాబును పదవి నుంచి తప్పించాలన్న పంతంతోనే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డికి జరిగిన అవమానంతోనే సురేష్ బాబు మేయర్ పదవికి దూరం కావాల్సి వచ్చింది.
* మేయర్ పక్కనే ఎమ్మెల్యే కుర్చీ..
కడప కార్పొరేషన్ లో ఒక ఆనవాయితీ కొనసాగుతూ వచ్చింది. మేయర్ సీటు పక్కనే ఎమ్మెల్యేకు ఒక కుర్చీ కేటాయించడం జరుగుతూ వచ్చింది. 2021 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కడప మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. సురేష్ బాబు మేయర్ అయ్యారు. అప్పట్లో స్థానిక ఎమ్మెల్యేగా అంజాద్ బాషా( Amjad Basha ) ఉండేవారు. ఆయన మంత్రి తో పాటు డిప్యూటీ సీఎం హోదాలో ఉండేవారు. ఈ క్రమంలో మేయర్ సురేష్ బాబు కుర్చీ పక్కనే అంజాద్ భాషకు ఒక కుర్చీ వేసేవారు. ఆయన సమావేశాలకు రాకున్నా ఆ కుర్చీ అలానే ఉండేది. కానీ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం.. స్థానిక ఎమ్మెల్యేగా రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గెలవడంతో మేయర్ పక్కనే ఉండే కుర్చీని తొలగించారు. అప్పటినుంచి వివాదం కొనసాగింది. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ ఆ పదవిలో ఉండకూడదని భావించారు రెడ్డప్ప గారి మాధవి రెడ్డి. అందుకు తగిన సమయం కోసం వేచి చూశారు.
* రెండోసారి వేటు..
మేయర్ సురేష్ బాబు కడప నగరంలో నామినేటెడ్ పద్ధతిన తన కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున పనులు అప్పగించారు. అయితే దీనిపై అధ్యయనం చేసిన పురపాలక శాఖ నిజమేనని తేలడంతో ఆయనపై మే నెలలోనే అనర్హత వేటు వేసింది. అయితే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి నిబంధనలు ఉల్లంఘించారంటూ తేల్చిన పొరపాలక శాఖ అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్ పీఠాన్ని అడ్డం పెట్టుకుని సొంత కుటుంబానికి కాంట్రాక్టులు ఇచ్చుకున్నారు సురేష్ బాబు. ఆయన కుటుంబ సభ్యులు అక్రమంగా టెండర్లు పొందినట్లుగా తేలడంతో పురపాలక శాఖ ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతోనే వేటు వేయడంతో సురేష్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కేవలం ఎమ్మెల్యే తో లొల్లి పెట్టుకోవడం వల్లే సురేష్ బాబుకు ఈ పరిస్థితి వచ్చింది.