TDP: ఎన్నికల అన్నాక అసమ్మతులు, అసంతృప్తులు సర్వసాధారణం. అయితే వాటిని వీలైనంతవరకు సమసి పోయేలా చేయడంతోనే రాజకీయ పార్టీలు మెరుగైన ఫలితాలు సాధిస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి జగన్ పెద్ద సాహసమే చేశారు. దాదాపు 80 చోట్ల సిట్టింగ్లను మార్చారు. కొందరికి స్థానచలనం కల్పించారు. మరికొందరికి పక్కన పెట్టారు. ఈ చర్యలతో వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొంది. చాలామంది నాయకులు బయటకు వెళ్లిపోయారు. కొంతమంది మాత్రం సైలెంట్ గా ఉన్నారు.
వైసిపి ఇప్పటివరకు ఏడు జాబితాలను ప్రకటించింది. చాలామంది తలరాతలు మారిపోయాయి. దీంతో వారు పక్క పార్టీల్లో చేరారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, దాడి వీరభద్రరావు, వసంత కృష్ణ ప్రసాద్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా నేతలందరూ వెళ్లిపోవడం వైసీపీకి ఒక కుదుపుగా మారింది. అయినా సరే జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సర్వేల్లో వెనుకబడిన వారిని పక్కకు తప్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వైసీపీలో పరిస్థితి సద్దుమణుగుతోంది.
అయితే ఇప్పుడు టిడిపి వంతు వస్తోంది. జనసేనతో పొత్తులో భాగంగా చాలా స్థానాలు కోల్పోవాల్సి వస్తుంది. దీంతో టీడీపీ నేతల్లో ఒక రకమైన భయం నెలకొంది. అటు చంద్రబాబు పొత్తుల లో భాగంగా కోల్పోవాల్సిన నియోజకవర్గాల విషయంలో ఒక స్పష్టతనిస్తున్నారు. నేరుగా అక్కడ ఆశావహుడుగా ఉన్న టిడిపి నేతతో మాట్లాడుతున్నారు. దీంతో చాలామంది ఆందోళనకు గురై పక్క పార్టీలో చేరుతున్నారు. దీనికి కారణం గానే జాబితాను చంద్రబాబు బయట పెట్టడం లేదు. కానీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన మరుక్షణం తెలుగుదేశం పార్టీలో అలజడి రేగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టిడిపి నేత బుద్ధా వెంకన్న భావిస్తున్నారు. గతంలో ఈ స్థానం నుంచి ప్రజారాజ్యం గెలిచినందుకు.. జనసేనకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో బుద్దా వెంకన్నకు చాన్స్ లేకుండా పోయింది. పోనీ అనకాపల్లి పార్లమెంట్ స్థానమైన తనకు ఇవ్వండి అని వెంకన్న అడుగుతున్నారు. కానీ అక్కడ పోటీకి నాగబాబు సిద్ధపడ్డారు. దానిని కూడా జనసేనకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఒక్క బుద్ధా వెంకన్న విషయంలోనే కాదు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు బలమైన అభ్యర్థులు గానే ఉన్నారు. ఆ స్థానాలను సైతం జనసేన ఆశిస్తోంది. దీంతో నేతల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇదే జాబితా వెల్లడైతే మాత్రం అసంతృప్తి కాస్త అసమ్మతిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.