Homeఆంధ్రప్రదేశ్‌Balakrishna Vs NTR: తీయించేయ్.. ఎన్టీఆర్ పై బాలయ్యకు ఎందుకంత కోపం?

Balakrishna Vs NTR: తీయించేయ్.. ఎన్టీఆర్ పై బాలయ్యకు ఎందుకంత కోపం?

Balakrishna Vs NTR: నందమూరి కుటుంబ సభ్యుల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో వెలుగు చూశాయి . గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద మరో ఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్ కు తారక్ నివాళి అర్పించే క్రమంలో అభిమానులు సీఎం అన్న నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ అభిమానులు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే బాలకృష్ణ రావడంతో వాటిని తొలగించడం వివాదంగా మారింది. బాలకృష్ణ ఆదేశాలతోనే వాటిని తొలగించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఏటా ఆయన జయంతి, వర్ధంతి సమయంలో ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పిస్తుంటారు. ఈరోజు ఉదయానికే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ తాతకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారీగా అభిమానులు తరలివచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ఘాట్ మార్గంలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అక్కడికి కొద్దిసేపటికి బాలకృష్ణ చేరుకున్నారు. ఆయన వచ్చిన క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడ నుంచి తొలగించడం విశేషం.

అయితే బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలగించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ టిడిపికి దూరంగా ఉన్నారు. పార్టీకి అనుకూలంగా ఏ ప్రకటన చేయడం లేదు. విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, చంద్రబాబు భార్య భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు, చంద్రబాబు కంటతడి పెట్టడం వంటి అంశాలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై టిడిపి శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను తమ వాడిగా చెప్పుకుంటాయి. దీంతో నందమూరి అభిమానులు తప్పించి.. టిడిపి శ్రేణులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పై మండిపడుతున్నాయి.

తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై కూడా తారక్ స్పందించలేదు. ఒక్క ప్రకటన కూడా చేయలేదు. దీనిపై ఆ మధ్యన బాలకృష్ణ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఐ డోంట్ కేర్ అంటూ సంబోధించారు. దీంతో వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సమయంలో తాజాగా ఫ్లెక్సీల వివాదం అలుముకుంది. బాలకృష్ణ సూచనతోనే ఫ్లెక్సీలను తొలగించారని తారక్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అటువంటిదేమీ లేదని బాలకృష్ణ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల టిడిపి సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి అదే తరహా ఫ్లెక్సీ వివాదం తెరపైకి రావడం విశేషం. అయితే లోగుట్టు అనేది ఎవరికీ తెలియడం లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version