Pinnelli Ramakrishna Reddy: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినది కరెక్టేనా? ఆయన చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కాదా? 20 సంవత్సరాలు పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఎన్నికల నిబంధనలు తెలియవా? ఆయన తన చర్యలను ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆ విధ్వంసానికి పాల్పడడం ఏమిటి? దానిని వైసీపీ సమర్ధించడం ఏమిటి? ఇదే రాష్ట్రంలో ప్రధాన చర్చగా మారింది.
పోనీ ఆ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగిందే అనుకుందాం. దానిపై న్యాయపోరాటం చేయాల్సిన అవసరం ఒక సీనియర్ ప్రజాప్రతినిధిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఉంది. కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం.. ప్రజాభిప్రాయం నిక్షిప్తమైన ఈవీఎంలను ధ్వంసం చేయడం దేనికి సంకేతం? గెలుస్తాం అన్న ధీమా ఉంటే ఈ పని చేస్తారా? విజయంపై నమ్మకం లేక.. ఓడిపోతానన్న భయంతోనే ఈ తరహా చర్యలకు దిగారని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. సంఘటన జరిగి, బయటపడిన తరువాత సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమంటున్న ఆయన.. ఆ పోలింగ్ కేంద్రంలో అవకతవకలు జరిగాయి అనుకుంటే.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు? చట్టాన్ని తన చేతిలోకి ఎందుకు తీసుకున్నారు? తానే ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చారు? అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఆయనపై ఉంది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని పక్కన పెడదాం.. అసలు ఈ ఘటన విషయంలో వైసీపీ స్పందన ఏంటి? ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలు కోసం పాటుపడాలన్నది ఒక నినాదం. పిన్నెల్లి ఒక వ్యక్తిగా తప్పు చేస్తే.. ఒక బాధ్యతాయుతమైన పార్టీగా వైసీపీ చేసినది ఏంటి? ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయరా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పిన్నెల్లి చేసింది తప్పు అయితే.. దానిని సమర్ధించి వైసిపి మరింత తప్పు చేసింది. తమకు ప్రజాస్వామ్య విలువలతో సంబంధం లేదన్నట్టు వ్యవహరించింది. ఈరోజు పిన్నెల్లి అవుతారు.. రేపు పొద్దున్న మరో పార్టీ సైతం.. తమ పార్టీ నేతల విధ్వంసకాండ కు ఇలానే సమర్థిస్తే.. ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. అందుకే ప్రజాస్వామ్యం అన్న మాట మరిచిపోవడమే మంచిది.