AP BJP: ఆ ముగ్గురు బిజెపి నేతల పరిస్థితి ఏంటి?

ఏపీ బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు. అసలు బిజెపి అభ్యర్థుల తరపున కూడా ప్రచారం చేయలేదు. ఆది నుంచి టిడిపి తో బీజేపీ పొత్తును వీర్రాజు వ్యతిరేకించారు.

Written By: Dharma, Updated On : May 23, 2024 10:00 am

AP BJP

Follow us on

AP BJP: ఏపీలో ఎన్నికలు ముగిస్తాయి. ఫలితాల కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. పోలింగ్ కు, కౌంటింగ్ కు మధ్య మూడు వారాల సమయం ఉండడంతో అభ్యర్థులు రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళిపోయారు. కొందరు విదేశీ పర్యటనలకు వెళ్ళగా.. మరికొందరు విహారయాత్రలో మునిగిపోయారు. అయితే ఎన్నికలకు ముందే ఏపీకి చెందిన బిజెపి సీనియర్లు కనిపించకుండా పోయారు. ఎన్నికల ప్రచారంలో కానీ, క్యాంపెయినింగ్లో కానీ వారి జాడ లేకుండా పోయింది. ఫలితాల ప్రకటన తర్వాత వారు ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.

ఏపీ బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు. అసలు బిజెపి అభ్యర్థుల తరపున కూడా ప్రచారం చేయలేదు. ఆది నుంచి టిడిపి తో బీజేపీ పొత్తును వీర్రాజు వ్యతిరేకించారు. అయితే అనూహ్యంగా ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించి పురందేశ్వరిని తెరపైకి తెచ్చారు. టిడిపి తో పొత్తు కుదరడం, సీట్ల సర్దుబాటు వంటి అంశాల్లో కనీసం వీర్రాజుకు సంబంధం లేకుండా పోయింది. చివరకు సోము వీర్రాజు సొంత ప్రాంతమైన రాజమండ్రిలో పురందేశ్వరి పోటీ చేసినా ఆమెకు మద్దతు తెలపలేదు.

మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి జాడ సైతం ఈ ఎన్నికల్లో కనిపించలేదు. బిజెపిలో ఉండి వైసిపికి అనుకూలంగా పనిచేస్తారన్నది విష్ణువర్ధన్ రెడ్డి పై ఉన్న ఆరోపణ. ఈయన కూడా టిడిపి తో పొత్తుని వ్యతిరేకించారు. పొత్తుకు ముందు అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. పొత్తు కుదిరిన తర్వాత హిందూపురం పార్లమెంట్ సీటు గురించి ప్రయత్నం చేశారు. కానీ ఈయన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. అయితే కూటమి మేనిఫెస్టో బిజెపికి సంబంధం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో కానీ, ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కానీ ఎక్కడా కనిపించలేదు.

మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం అడపాదడపా మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. విశాఖ ఎంపీ సీటును ఆశించిన ఆయన.. చివరి వరకు ప్రయత్నించారు. దక్కకపోయేసరికి అసంతృప్తికి గురయ్యారు. కానీ ఎక్కడా కూటమికి మద్దతుగా ప్రచారం చేయలేదు. బిజెపి అగ్ర నేతలు వచ్చినప్పుడు కూడా కనిపించలేదు. ఒకవేళ కూటమి గెలిస్తే ఈ నాయకుల పాత్ర ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. కూటమి ఓడిపోతే మాత్రం వీరి స్వరం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.