CM Chandrababu  :  డోర్లు తెరిచిన కూటమి.. వైసీపీలో టెన్షన్

సాధారణంగా అధికార పార్టీలోకి చేరికలు ఖాయం.ఓడిపోయిన పార్టీలో భవిష్యత్తు లేదనుకుంటున్న నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడడం సర్వసాధారణం.ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది వైసిపి. ఇన్ని రోజులు చేరికలకు కూటమి పార్టీలు మొగ్గు చూపలేదు. కానీ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైసీపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Written By: Dharma, Updated On : October 10, 2024 3:18 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu  :  ఏపీ సీఎం చంద్రబాబు డోర్లు తెరిచారా? పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? వైసిపి నుంచి భారీ చేరికలు ఉంటాయా? ఆ పార్టీ కీలక నేతలు టిడిపిలో చేరుతారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసిపి ఓటమి తర్వాత చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. సీనియర్లు మౌనంగా ఉన్నారు. కొంతమంది జూనియర్లు సైతం తమకేందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఉన్న కొద్దిమంది జగన్ భక్తులు ఎంతో కొంత మాట్లాడుతున్నారు. దీంతో పార్టీలో ఒక రకమైన నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. అందుకే జగన్ పార్టీలో ప్రక్షాళనకు దిగారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. జిల్లా అధ్యక్షుల మార్పు సైతం అందులో భాగమే.కొన్నినియోజకవర్గాల బాధ్యులను సైతం మారుస్తున్నారు. అయితే జగన్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దెబ్బతీయాలని చంద్రబాబు తాజాగా భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగావైసీపీ నేతలను ఒక్కొక్కరికి టిడిపి కండువాలు కప్పుతున్నారు.వైసిపి తో పాటు రాజ్యసభ పదవులు వదులుకున్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. త్వరలో మరింతమంది టీడీపీలో చేరతారని తెలుస్తోంది.

* పార్టీకి భవిష్యత్తు లేకపోవడంతో..
శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు.. చాలామంది వైసిపి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వైసిపి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్ధపడుతున్నారు. మరికొందరు కొద్దికాలం వేచి చూడాలని భావిస్తున్నారు. అయితే పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్లడమే మేలన్న రీతిలో చాలామంది వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి వైసీపీకి దూరంగా ఉంటే.. భవిష్యత్తులో జరిగే రాజకీయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుందామన్న వారు ఉన్నారు.

* నమ్మకస్తులైన నేతలు సైతం
ఎన్నికల ఫలితాల తరువాత చాలామంది వైసీపీని వీడారు. అందులో జగన్ కు అత్యంత ఆత్మీయులు కూడా ఉన్నారు. గత ఐదేళ్లుగా పదవులు అనుభవించిన వారు, ఎనలేని ప్రాధాన్యం దక్కించుకున్న వారు సైతం పునరాలోచనలో పడ్డారు. అయితే దాదాపు పదిమంది వరకు క్రియాశీలక నేతలు వైసిపికి గుడ్ బై చెప్పారు. అలాగని వారికి కూటమి పార్టీల నుంచి ఆహ్వానం లేదన్న ప్రచారం సాగింది. అందుకే వైసిపికి గుడ్ బై చెప్పిన వెంటనే వారు ఏ పార్టీలో చేరలేదు. కానీ ఇటీవల బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను లాంటి నేతలు జనసేనలో చేరారు. ఇప్పుడు తాజాగా మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు టిడిపిలో చేరారు. తద్వారా కూటమి పార్టీలు డోర్లు తెరిచినట్లు అయ్యింది. అందుకే చాలామంది వైసిపి నేతలు పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.