Dharmana Prasada Rao: రాజధానుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాండ్ అంటూ లేకుండా పోతోంది. మొన్నటి వరకు మూడు రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరును కలుపుతూ మావిగన్ రాజధాని ఏర్పాటు చేయాలని ప్రత్యామ్నాయం సూచించారు. దాదాపు అమరావతి రాజధానికి దగ్గరగానే ఆయన సూచనలు ఉన్నాయి. కానీ ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ మాట చెప్పడమే విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు అమరావతి ప్రతిపాదన చేసినప్పుడే ఈ మావిగన్ సూచించి ఉంటే బాగుండేది. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అనేకంటే.. ఈ మావిగన్ ప్రతిపాదన చేసి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు ఆ ప్రతిపాదన చేస్తుండడం మాత్రం ఇబ్బందికరంగా మారింది. అనవసరంగా ఆయన టార్గెట్ అవుతూ వస్తున్నారు.
* ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై..
ఒకవైపు మావిగన్ ప్రతిపాదన చేయగా.. ఇంకోవైపు ధర్మాన లాంటి సీనియర్ నేత వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు ఇదే ధర్మాన మేధావి ఉత్తరాంధ్రకు రాజధాని ప్రకటించడాన్ని హర్షించారు. విశాఖ పాలన రాజధానిని ఆహ్వానించారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఊరువాడ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిని ఏం అనడం లేదు. ఆది నుంచి చంద్రబాబు స్టాండ్ అమరావతి. ఆయన మాట మార్చలేదు. కానీ మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను పాలన రాజధాని చేస్తానన్నారు జగన్. దానిని విస్తృతంగా ప్రచారం చేశారు ధర్మాన. 2024 ఎన్నికలకు ముందు ఈ సీనియర్ నేత తన సొంత నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో దీనిపైనే డిబేట్ పెట్టారు. ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు జగన్ మూడు రాజధానుల నుంచి మావిగన్ వైపు వెళ్తే దాని గురించి పట్టించుకోవడం లేదు.
* విశాఖ టు మావిగన్..
ప్రస్తుతం ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి చేసినట్టే. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలోని విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు. దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ధర్మాన. ఇప్పుడు అదే జగన్ విశాఖ కాదు మావిగన్ అంటున్నాడు. కానీ ధర్మాన జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని.. విభజన చట్టమే చెప్పిందని.. 80 ఏళ్ల వయసులో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు పొట్ట చేత పట్టుకుని వలస వెళ్తున్నారని.. రాయలసీమ బిడ్డగా ఉండి ఆ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారని నిలదీస్తున్నారు ధర్మాన. కానీ విశాఖ పాలన రాజధానిగా ప్రకటించి.. దాని నుంచి పక్కకు తప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఏమీ అనడం లేదు. అందుకే ధర్మాన అపరమేధావి అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు నమ్మలేని స్థితికి చేరుకున్నారు.