TTD: ధర్మారెడ్డి అవుట్.. టీటీడీ నుంచే చంద్రబాబు ప్రక్షాళన

మరోవైపు సీఎంఓలోకి కీలక అధికారులను తీసుకోవడానికి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఏవి రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Written By: Dharma, Updated On : June 15, 2024 10:20 am

TTD

Follow us on

TTD: చంద్రబాబు ప్రక్షాళనను ప్రారంభించారు. జగన్ సర్కార్ హయాంలో కీలక అధికారులను సాగనంపుతున్నారు. తన టీం ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకు తిరుమల నుంచే శ్రీకారం చుట్టారు. టీటీడీ ఇంచార్జ్ ఈవోగా కొనసాగుతున్న ధర్మారెడ్డిని తప్పించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్యామలరావును పూర్తిస్థాయి ఈవో గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్యామల రావు సమర్థ అధికారిగా పేరు ఉంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా మెరుగైన సేవలు అందించారు. ఆదాయం పెంచుకునేందుకు దోహదపడ్డారు. అందుకే ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా నియమించినట్లు తెలుస్తోంది.

నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి టీటీడీ ఈవో గా ఉండేవారు. 2022 మేలో ఆయనకు బదిలీ జరిగింది. అప్పట్లో అదనపు ఈవో గా ఉన్న ధర్మారెడ్డికి ఈవో గా అదనపు బాధ్యతలు అప్పగించింది జగన్ సర్కార్. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ పోస్టులోకి ఎవరినీ రానివ్వలేదు. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి తిరుపతి అంటే ధర్మారెడ్డి పేరే వినిపించేది. ఆయన హయాంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం రాగానే ఆయన ఈనెల 11న సెలవు పై పంపించారు. శుక్రవారం ఇక్కడ నుంచి పూర్తిగా రిలీవ్ చేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే పాలనలో ప్రక్షాళన ప్రారంభమవుతుందని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభించారు.

మరోవైపు సీఎంఓలోకి కీలక అధికారులను తీసుకోవడానికి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఏవి రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి చెందిన రాజమౌళి 2003 బ్యాచ్ యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి. టిడిపి ప్రభుత్వ హయాంలో 2015-19 మధ్య ముఖ్యమంత్రి కార్యదర్శిగా సీఎంవో లో పనిచేశారు. ప్రస్తుతం యుపి హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంటర్ స్టేట్ క్యాడర్ డిప్యూటేషన్ పై ఆయన ఏపీకి పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కార్తికేయ మిశ్రా 2009 ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం డిప్యూటేషన్ పై కేంద్ర ఆర్థిక సేవల శాఖలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను రిలీవ్ చేసి ఏపీకి పంపించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.