Deputy CM Pawan Kalyan: వైసిపి హయాంలో రుషికొండలో భారీ భవంతులు నిర్మించారు. దాదాపు 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనాలు అత్యంత వివాదాస్పదం అయ్యాయి. విశాఖలో రిషికొండ అంటే ల్యాండ్ మార్క్. చూడచక్కని పర్యాటక ప్రాంతం. వైసీపీ అధికారంలోకి వచ్చాక రుషికొండపై పరదాలు కట్టి నిర్మాణాలు ప్రారంభించింది. అక్కడ నిర్మాణాలు పర్యాటక రంగానికి విఘాతమని.. పర్యావరణ నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు వచ్చాయి. అయినా సరే రుషికొండకు పరదాలు కట్టి మరీ నిర్మాణాలు చేశారు. అటువైపు ఎవరు వెళ్లకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఐదేళ్లపాటు ఆంక్షలు నడుమ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఎన్నికలకు ముందు ఆ నిర్మాణాలు రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసమని చెప్పుకొచ్చారు. సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు వివిధ విభాగాధిపతుల కోసం నిర్మించినట్లు లీకులు ఇచ్చారు. గతంలో ఈ నిర్మాణాల పరిశీలనకు జనసేన అధినేత పవన్ వెళ్లారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో వెళ్లేసరికి సాదరంగా ఆహ్వానించారు.పోలీసుల భద్రత నడుమ హుందాగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు పవన్ కళ్యాణ్.
* అదో సంచలనమే
అయితే పవన్ రుషికొండలో ఎందుకు పర్యటించారు? దాని వెనుక ఉన్న కధేంటి? అన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రుషికొండ నిర్మాణాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. భారీ భవంతులు, అందులో కళ్ళు చెదిరే నిర్మాణాలు, ఖరీదైన వస్తువులు చర్చకు దారి తీసాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ నిర్మాణాలను బయట ప్రపంచానికి తెలియచెప్పాయి. దీంతో 700 కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన నిర్మాణాలు ఇవి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవాలని సోషల్ మీడియాలో ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి.
* ఈ సందర్శన వెనుక
అయితే రుషికొండ విషయంలో కూటమి సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు సైతం విశాఖలో పర్యటించారు. కానీ అటువైపుగా వెళ్లలేదు. ప్రస్తుతం పవన్ విజయనగరం వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో రుషికొండ నిర్మాణాలను పరిశీలించారు. దీంతో ప్రభుత్వం వీటి విషయంలో ఆలోచన చేస్తుందా అన్న చర్చ ప్రారంభం అయింది. పవన్ పర్యటన నేపథ్యంలో.. త్వరలో రుషికొండ భవనాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.