AP Rains : ఏపీకి వరుసుగా బంగాళాఖాతం నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. అల్పపీడనాలు ముంచేస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూ.. ఏపీ ప్రజలతోపాటు ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆగస్టులో వచ్చిన వరదలు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేశాయి. అటు తర్వాత కూడా అల్పపీడనాలు ఏర్పడ్డాయి. పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం అదే రోజు సాయంత్రానికి బలపడింది. మంగళవారం ఉదయానికి వాయుగుండం గా మారింది. బుధవారం కానీ.. గురువారం కానీ ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. గురువారం అర్ధరాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ఒడిస్సా లోని పూరి, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటోచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఒకవేళ తీవ్ర తుఫానుగా మారితే దానికి ‘దానా’ అనే పేరు పెట్టడానికి అధికారులు సన్నాహాలు చేశారు.
* ఉత్తరాంధ్ర పై పెను ప్రభావం
అయితే దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టింది.
* కేంద్రం స్పందన
మరోవైపు కేంద్రం సైతం ఈ తుఫాను పై స్పందించినట్లు తెలుస్తోంది. తుఫాను హెచ్చరికలతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సంబంధిత శాఖలతో పాటు ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాలకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా వివరించే ప్రయత్నం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పుకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్టిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రకటించారు.